దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మమతామోహన్‌దాస్. ఆమె మంచి గాయని కూడా కావడం విశేషం. కొన్నాళ్ల క్రితం ఆనారోగ్యం కారణంగా సినిమాలకు దూరమైన మమతా.. మళ్లీ తన మాతృభాష మలయాళంలో బిజీ అయ్యింది. తమిళంలో విజయ్‌సేతుపతితో కలిసి ఆమె నటించిన చిత్రం ‘మహారాజా’గా తెలుగులో విడుదల కానుంది. ఇలా వరుసగా అవకాశాలు అందుకుంటూ, పూర్వవైభవాన్ని దక్కించుకుంటున్నది మమతామోహన్‌దాస్.
ఇదిలావుంటే.. 39ఏళ్ల ఈ అందాలభామ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, డేటింగ్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘లాస్ ఏంజెల్స్ ఉన్నప్పుడు ఒకరిని ఇష్టపడ్డాను. కానీ ఆ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. ఒత్తిడితో కూడిన బంధాలు నిలవవు. బంధం బలంగా ఉండాలి. ఇప్పుడైతే మానసికంగా ధృఢంగా ఉన్నాను. నాకైతే జీవితానికి కచ్చితంగా తోడు అవసరమని నేను అనుకోవడంలేదు. నా మైండ్‌సెట్‌కి దగ్గరగా ఉండే వ్యక్తి దొరికితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. ఒకవేళ అదే జరిగితే.. అందరికీ చెప్పే చేసుకుంటా’ అని చెప్పింది మమతా మోహన్‌దాస్.