Mahakali | ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్నది. తాజాగా ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’ పేరుతో మూడో చిత్రం రాబోతున్నది. భారతదేశం నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. గురువారం దుర్గాష్టమిని పురస్కరించుకొని అనౌన్స్మెంట్ పోస్టర్ను విడుదల చేశారు.
బెంగాల్ నేపథ్యంలో కాళీదేవి ప్రధానంగా నడిచే కథాంశమిదని, భారతీయ మహిళ సాధికారత, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ‘కాళీదేవి ఉగ్రస్వరూపం, దయార్థ్రహృదయం నుంచి ప్రేరణ పొంది ఈ కథ తయారు చేశాం. భారతీయ మహిళల అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనంలా ఉంటుంది’ అని చిత్ర కథా, స్క్రీన్ప్లే రచయిత ప్రశాంత్వర్మ తెలిపారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాల కలబోతగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తారు. ఐమాక్స్ త్రీడీలో కూడా ఈ సినిమాను చూడొచ్చని, భారతీయ, విదేశీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్సాయి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, రచయిత: ప్రశాంత్వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.