భారతీయ ఇతిహాసం మహాభారతాన్ని వెండితెర దృశ్యమానం చేయడమే తన ఆశయమని చెప్పారు అగ్ర నటుడు అమీర్‌ఖాన్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులకు ఈ ఏడాదిలోనే శ్రీకారం చుట్టబోతున్నానని ఆయన తెలిపారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మహాభారతం సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇదొక సినిమా కాదని ఓ యజ్ఞంలాంటిదని అమీర్‌ఖాన్ అభిప్రాయపడ్డారు. ‘మహాభారతం వంటి విస్త్రృత పరిధి ఉన్న కథను కేవలం ఒక్క సినిమాలో చూపించలేం. కొన్ని సిరీస్‌లుగా తెరకెక్కించాల్సి ఉంటుంది. హాలీవుడ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రయాలజీ తరహాలో ప్రేక్షకులకు అందించాలి. దీని రచనకే రెండేళ్లకుపైగా సమయం పట్టొచ్చు. ఈ సినిమాలో నేను నటిస్తానా? ఏదైనా భాగానికి దర్శకత్వం వహిస్తానా? అనే విషయాల గురించి ఇప్పుడే మాట్లాడలేను. అయితే నా నిర్మాణంలోనే ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తా. నేటి తరానికి గొప్ప ఇతిహాసాన్ని అందించాలన్నదే నా కల’ అని అమీర్‌ఖాన్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా మహాభారత ప్రాజెక్ట్ గురించి అమీర్‌ఖాన్ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు. మహాభారత కథ ప్రతీ భారతీయుడి రక్తంలో ఉంది కాబట్టి ఎంతో బాధ్యతతో, అంకితభావంతో తెరకెక్కించాలని, అందుకు చాలా సమయం పడుతుందని ఆయన అన్నారు. దాదాపు 1000కోట్లకుపైగా వ్యయంతో అమీర్‌ఖాన్ ఈ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.