Annagaru Vostaru | ప్రముఖ తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) విడుదలకు ముందే చిక్కుల్లో పడింది. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం కారణంగా ఈ సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ‘వా వాతియార్’ నిర్మాత జ్ఞానవేల్రాజాకు, ఫైనాన్షియర్ అర్జున్లాల్కు మధ్య ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమకు చెల్లించాల్సిన బకాయిలు విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఫైనాన్షియర్ అర్జున్లాల్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురువారం ఈ పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తుంది.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించగా కృతి శెట్టి కథానాయికగా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కార్తి పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) అనే పేరుతో విడుదల కాబోతుంది.