Mansoor Ali Khan | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవిలపై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ (Mansoor Ali Khan) పరువు నష్టం కింద కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. అలాగే మన్సూర్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది.
ఇంతకీ ఏం జరిగింది అంటే ?..
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ ‘లియో’ మూవీపై మాట్లాడుతూ.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేగాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు ఖుష్బూ, మెగాస్టార్ చిరంజీవి తదితరులు త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు. అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
అయితే క్షమాపణలు చెప్పిన అనంతరం తన పరువుకు భంగం కలిగించారంటూ.. త్రిష, ఖుష్బూ, చిరంజీవిలపై గత నెల మద్రాస్ హైకోర్టులో మన్సూర్ అలీ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ధనంజయన్ ద్వారా కోటి నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లో కోరారు. ఇక ఈ పిటిషన్లో వీడియో మొత్తం చూడకుండా తన పరువుకు భంగం కలిగించారని మన్సూర్ అలీఖాన్ పేర్కొన్నాడు. అయితే ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ కుమార్ కేసును కొట్టివేశాడు. పబ్లిసిటీ కోసం మాత్రమే మన్సూర్ కోర్టును ఆశ్రయించాడని.. మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు దానిని ఖండించడం అనేది సాధారణ మానవ ప్రతిస్పందన అని కోర్టు పేర్కొంది. ఇది పరువునష్టం కిందికి రాదు అంటూ ధర్మసనం వెల్లడించింది. అలాగే త్రిషపై చేసిన వ్యాఖ్యలకు గాను మన్సూర్‌కు రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది.