బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ లాంటి తన కెరీర్‌ను ఉత్సాహంగా కొనసాగిస్తున్నది. కుదిరితే సినిమాలు లేకుంటే వెబ్ సిరీస్‌లు ఇంకా వీలుంటే వీడియో ఆల్బమ్స్ చేస్తూ తన అభిమానులను సంతోషంగా ఉంచుతున్నది. ఒకప్పుడు ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘పుకార్’, ‘తేజాబ్’, ‘దేవదాస్’ లాంటి చిత్రాలతో థియేటర్లను ఊపేసిందామె క్రేజ్. తెరకు తిరిగొచ్చాక ‘టోటల్ ధమాల్’, ‘కలంక్’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది మాధురీ, ఇటీవలే ‘ద ఫేమ్ గేమ్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టింది.
ఆమె లాక్ డౌన్లో పారిశుధ్య కార్మికులకు అంకితమిస్తూ చేసిన ‘క్యాండిల్’ మ్యూజిక్ వీడియోకు మంచి పేరు రాగా..తాజాగా ‘తు హై మేరా’ అనే మరో పాటను రూపొందించింది. ఈ పాటను మాధురీ స్వయంగా రాసి పాడింది. నిర్మాతగానూ వ్యవహరించింది. ఈ నెల 15న ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘తు హై మేరా’ మ్యూజిక్ వీడియో విడుదల చేయబోతున్నారు. తనను ఇన్నేళ్లుగా అభిమానిస్తున్న వారికి ఈ పాట అంకితమిస్తున్నట్లు మాధురీ తాజా ఇన్‌స్టా పోస్టులో తెలిపింది.