Madhuram | యువ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత యం. బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. దర్శకుడు రాజేష్ చికిలే రూపొందించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీ చిత్రం ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్‌లైన్‌తో ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఇటీవల విడుదల చేశారు.
ట్రైలర్ విడుదల అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ.. మధురం ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. నిర్మాత బంగార్రాజు ఉన్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మధురమైన విజయాన్ని సాధించి, హీరో ఉదయ్ రాజ్, దర్శకుడు రాజేష్‌లకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని కోరుకుంటూ, టీమ్ అందరికీ శుభాకాంక్షలు, అని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె, దర్శకుడు విజయ్ కుమార్ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ, “మధురం’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీ చూస్తుంటే నా గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. 2008లో నేను దర్శకత్వం వహించిన ‘అందమైన మనసులో’ చిత్రం కూడా ఇలాంటి కాన్సెప్ట్‌తో రూపొందింది. అప్పట్లో అది కాస్త ముందుగా వచ్చిన సినిమాగా అనిపించింది. ఇప్పుడు ఇలాంటి కథతో ‘మధురం’ రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రేమకథలు రూపొందించడం సవాల్‌తో కూడుకున్నది, కానీ ట్రైలర్ చూస్తే భావోద్వేగాలు బాగా పండినట్లు అనిపించింది. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహిస్తే బంగార్రాజు లాంటి కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. టీమ్‌కి శుభాకాంక్షలు,” అని అన్నారు.
రఘు కుంచె మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని పాటలు మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. 90ల నేపథ్యంలో వచ్చిన చిత్రాలు అన్నీ పెద్ద హిట్లే. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఉదయ్ రాజ్ హీరోగా మరిన్ని పెద్ద చిత్రాలు చేయాలి. టీమ్ అందరికీ మంచి గుర్తింపు రావాలని ఆశిస్తున్నా,” అని చెప్పారు.
దర్శకుడు విజయ్ కుమార్ కొండా మాట్లాడుతూ, “టైటిల్ ఎంత మధురంగా ఉందో, సినిమా కూడా అంతే మధురంగా ఉంటుంది. 90లలోని స్వచ్ఛమైన ప్రేమను ఈ చిత్రం చూపిస్తుంది. ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది. పాటలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. హీరో, హీరోయిన్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం టీమ్‌కి మధురమైన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా,” అని అన్నారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ట్రైలర్ విడుదల చేసిన వినాయక్ గారికి ధన్యవాదాలు. ఆయన మద్దతు మరచిపోలేనిది. నిర్మాత బంగార్రాజు గారు ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి చాలా సహకరించారు. బడ్జెట్లో రాజీపడకుండా ఉన్నత నాణ్యతతో నిర్మించారు. దర్శకుడు రాజేష్ చాలా కష్టపడి, 90ల నేపథ్యాన్ని జాగ్రత్తగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు వెంకీ వీణ అద్భుతమైన సంగీతం అందించారు. డీవోపీ మనోహర్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది,” అని చెప్పారు.