Madhu Priya | ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి హంగామా మొదలైంది. తన చెల్లి శ్రుతిప్రియ పెళ్లి వేడుకలకి సంబంధించిన అన్ని పనులని స్వయంగా మధుప్రియే చూసుకుంటూ, కుటుంబంలో ఆనందాన్ని నింపుతోంది. ఇటీవలే చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ.. ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయింది. ఆగష్టు 5న ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చెల్లితో కలిసి మధుప్రియ తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించింది. ఆ సందర్భంలో తీసిన ఫొటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. “మా చెల్లి పెళ్లి కూతురయ్యింది!” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మధుప్రియ చెల్లికి ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ, చిన్నతనంలో ఓ స్టేజ్ షోలో ‘ఆడపిల్లనమ్మా’ పాట పాడి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 ఏళ్లు మాత్రమే. 2011లో ‘దగ్గరగా దూరంగా’ సినిమాలో “పెద్దపులి” పాటతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఫిదా, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, సాక్ష్యం, టచ్ చేసి చూడు, లైలా, సంక్రాంతికి వస్తున్నాం వంటి ఎన్నో చిత్రాల్లో పాడింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో గోదారి గట్టుమీద పాటను మధుప్రియ ఆలపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మేల్ వర్షన్ లో రమణ గోగుల పాడిన ఈ పాటకు, లేడీ వర్షన్ లో మధుప్రియ చక్కటి ప్రాణం పోసింది. ఇక 18ఏళ్ల వయసులో శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మధుప్రియ, కొంతకాలానికి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవితం గడుపుతోంది. ఇప్పుడు తన చెల్లి పెళ్లి వేడుకతో మధుప్రియ నెట్టింట తెగ హంగామా చేస్తుంది. మధుప్రియ చెల్లెలి పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. మరి పెళ్లి రోజు వేడుకల్లో మధుప్రియ ఇంకెన్ని జోష్ పెర్ఫార్మెన్స్‌లతో మెప్పిస్తుందో చూడాలి!