నటీనటులు: నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, రెబ్బా మోనికా జాన్, ప్రియాంక జువాల్కర్, విష్ణు, మురళీ గౌడ్ తదితరులు
దర్శకత్వం: కల్యాణ్ శంకర్
నిర్మాత: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య
సమర్పణ: నాగవంశీ సూర్యదేవర
సంగీతం: భీమ్స్
MAD Square | టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన నిర్మాణంలో వచ్చిన మ్యాడ్ స్క్వేర్ (MAD Square) చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాగా.. మొదటి పార్ట్‌లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్‌తో పాటు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. నాగవంశీ నిర్మించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్గా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రివ్యూ ఒకసారి చూసుకుంటే..?
కథ విషయానికి వస్తే.. మ్యాడ్ గ్యాంగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కథతో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వడంతో మ్యాడ్ స్క్వేర్ మొదలవుతుంది. కాలేజీ అనంతరం మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమకు నచ్చిన పని చేసుకొనే పనిలో ఉంటారు. అయితే ఈ క్రమంలోనే లడ్డుగాడి(విష్ణు)కి పెళ్లి కుదిరినట్లు మ్యాడ్ గ్యాంగ్‌కి తెలుస్తుంది. దీంతో అతడి పెళ్లికి వెళుతుంది ఈ గ్యాంగ్. అయితే పెళ్లికి అన్ని సిద్ధం అనుకుంటున్న సమయంలో లడ్డు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి సడన్‌గా లేచిపోతుంది. దీంతో లడ్డుని పట్టుకుని మ్యాడ్ గ్యాంగ్ పెళ్లి కాకుండానే గోవాకి హనిమూన్ ట్రిప్‌కి వెళతారు. అయితే మ్యాడ్ గ్యాంగ్ గోవాకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది. గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఈ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డూ తండ్రి (మురళీధర్ గౌడ్)ను భాయ్ (సునీల్) ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే.!
‘మ్యాడ్’ సినిమాతో తొలి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కల్యాణ్ శంకర్, తన రెండో చిత్రంలో అదే సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ తీసి, తన శైలిలోని ప్రత్యేకతను చాటే ప్రయత్నం చేశారు. కథలో పెద్దగా లోతు లేని ఒక చిన్న ఆలోచనను ఎంచుకొని, దాని చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ సినిమాను నడిపించారు, ఇదే ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. కొన్ని సన్నివేశాలు ఊహించని విధంగా ఆకట్టుకుంటే, మరికొన్ని మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగానే, బాలీవుడ్‌లోని ‘హంగామా’ సీరీస్ తరహాలో లాజిక్కు ఆస్కారం లేని, అర్థం లేని, సరదా కామెడీతో వినోదాన్ని అందించడంలో దర్శకుడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళితే, రెండున్నర గంటల పాటు వినోదాన్ని ఆస్వాదించవచ్చనే విషయాన్ని ‘మ్యాడ్ స్క్వేర్’ స్పష్టంగా చెబుతూ, ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది.
నటినటుల ఫర్మామెన్స్
‘మ్యాడ్’ తరహాలోనే ఈ సినిమాలో మనోజ్, అశోక్, దామోదర్ (నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్) తమ తమ పాత్రల్లో అలరించారు. లడ్డూ (విష్ణు) కూడా అద్భుతంగా రాణించారు. డిజే టిల్లు, బలగం సినిమాలతో అలరించిన మురళీధర్ గౌడ్ ఈ సినిమాలో తన నటనతో నవ్వులు పండించారు. అలాగే, సునీల్, శుభలేఖ సుధాకర్, మోనికా రెబ్బా జాన్ వంటి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టెక్నికల్ టీమ్
ఈ సినిమాకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాలు అద్భుతంగా పని చేశాయని చెప్పవచ్చు. భీమ్స్ తన పాటలతో అలరించగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను ఉర్రూతలూగించేలా తీర్చిదిద్దారు. నవీన్ నూలీ ఎడిటింగ్ ఈ చిత్రానికి ఒక మాయాజాలంలా అనిపిస్తుంది, సన్నివేశాలను వేగంగా నడిపిస్తూ కామెడీ మరియు వినోద రుచిని సమర్థవంతంగా ఆవిష్కరించారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గోవాలోని ఎపిసోడ్లను కెమెరాలో చాలా అందంగా చిత్రీకరించారు. హారికా, సాయి సౌజన్య నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కామెడీ, మ్యాడ్ బ్యాచ్ పెర్ఫార్మెన్స్
సాంగ్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
బలమైన కథ కాకపోవడం, లాజిక్ కి దూరంగా ఉండే కొన్ని సీన్స్
రేటింగ్: 3.5/5
చివరిగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా గురించి చెప్పాలంటే, ఇది ముందుగా చెప్పినట్లే ఒక అర్థం లేని కామెడీ చిత్రం. అయినప్పటికీ, ఎక్కడా విసుగు తెప్పించకుండా సన్నివేశాలు రూపొందడం ఈ సినిమాకు ప్రధాన బలం. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, యువతరం ఆనందించే కామెడీ చిత్రాన్ని చూడాలనుకునే వారికి ఈ వారం థియేటర్లో ఈ సినిమా పూర్తి విందు భోజనంలా ఉంటుంది.