‘ఇండస్ట్రీకి వచ్చి ఇరవైఏళ్లవుతుంది. అభిమానుల ఆదరణ, ప్రేమ వల్లే ఈ ప్రయాణం సాఫీగా సాగుతున్నది. ‘సై’ సినిమా తర్వాత గుంటూరొచ్చాను. అప్పటి మాదిరిగానే అదే ప్రేమను చూపిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 12న విడుదలకానుంది. శనివారం గుంటూరులో థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేశారు. నితిన్ మాట్లాడుతూ ‘మీ ఎనర్జీ చూస్తుంటే ఈ సినిమా విజయం ఖాయమనిపిస్తున్నది. మాస్ ఎంటర్టైనర్గా అందరిని ఆకట్టుకునే చిత్రమిది. అందరి అంచనాల్ని నిజం చేస్తుంది’ అన్నారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, ఈ మధ్యకాలంలో ఇంతటి మాస్ యాక్షన్ చూడలేదని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. కథానాయిక కృతిశెట్టి మాట్లాడుతూ ‘నితిన్ ఇరవైయేళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అదే ఎనర్జీతో ఉన్నారు. ఆయన మంచి మనసు వల్లే ఇది సాధ్యమైంది’ అని చెప్పింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్ పాత్రలో నటించానని, మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని కేథిరిన్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.