Maa inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా కథ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను దర్శకురాలు నందిని రెడ్డి వెల్లడించడంతో మూవీ మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ప్రమోషనల్ కార్యక్రమంలో నందిని రెడ్డి మాట్లాడుతూ, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కల్ట్ క్లాసిక్ ‘బాషా’ చిత్రంలోని కథా నిర్మాణం నుంచి ప్రేరణ పొందినట్లు తెలిపారు. అయితే అదే కథను కాపీ చేయకుండా, ఒక మహిళా ప్రధాన పాత్రను కేంద్రంగా చేసుకుని పూర్తిగా కొత్త కోణంలో కథను మలిచామని చెప్పారు.
‘బాషా’లో హీరోకు ఒక రహస్యమైన గతం ఉంటుంది. అదే తరహా టెంప్లేట్‌ను తీసుకుని, ఒక మహిళ అలాంటి పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో కథను రూపొందించాం. ఆధునిక ప్రేక్షకులకు నచ్చేలా అనేక మార్పులు చేసి కొత్తగా చూపించేందుకు ప్రయత్నించాం” అని నందిని రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా మొదట సమంత కోసం కాకుండా సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకుని రాసిన కథ అనే విషయం కూడా బయటకు వచ్చింది. ఇటీవల సమంత విడుదల చేసిన వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నందిని రెడ్డి తొలుత సాయి పల్లవి కోసం కథ సిద్ధం చేశారని చెప్పారు. అయితే అప్పట్లో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో సాయి పల్లవి ఈ చిత్రాన్ని చేయలేకపోయిందని, అనంతరం కథను తనకు అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కించారని సమంత వెల్లడించారు.
సమంత వ్యాఖ్యలపై స్పందించిన సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “ఈ సినిమా చివరకు మీ వద్దకే చేరాల్సి ఉంది సమంత గారు. మీకు, నందిని రెడ్డి గారికి నా ప్రేమతో కూడిన శుభాకాంక్షలు. త్వరలో మనం కలిసి పనిచేస్తాం” అని ఆమె పేర్కొన్నారు. దీంతో భవిష్యత్తులో సమంత-సాయి పల్లవి కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్లో సమంత పాత్ర చుట్టూ ఓ మిస్టరీని సృష్టిస్తూ, “నేను నిజంగా ఎవరో మీకు తెలుసా?” అనే డైలాగ్‌తో ఆసక్తిని రేకెత్తించారు. ఈ ఒక్క సన్నివేశమే సినిమాలో ఆమె పాత్రకు సంబంధించిన రహస్యాన్ని సూచిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. సుమారు 2 గంటల 34 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి సీబీఎఫ్సీ నుంచి యూఏ సర్టిఫికేట్ లభించింది. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, శ్రీముఖి, గౌతమి, లక్ష్మి, ఆనంద్, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.