Maa Inti Bangaram | స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన స్టార్డమ్ ఏంటో మరోసారి చూపించింది.. సామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ వరుస రికార్డులు సృష్టిస్తోంది. దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మహిళా ప్రధాన కథా చిత్రంగా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సాధారణంగా భారీ వసూళ్లు అంటే స్టార్ హీరోల సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేస్తూ సమంత తన సొంత స్టార్ పవర్‌తో ‘మా ఇంటి బంగారం’ను భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టింది. కథ, భావోద్వేగాలు, సమంత నటన, నందిని రెడ్డి దర్శకత్వం కలిసి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.
భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ‘మా ఇంటి బంగారం’ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా మార్కెట్లో ఈ సినిమా సంచలన కలెక్షన్లు నమోదు చేస్తోంది. విడుదలైన మూడు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ చిత్రం 2 మిలియన్ అమెరికన్ డాలర్ల (2 Million Dollars) వసూళ్ల మార్క్‌ను దాటేసి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఓ తెలుగు సినిమా ఉత్తర అమెరికాలో ఈ స్థాయి వసూళ్లు సాధించడం చాలా అరుదైన విషయం. ఈ ఘనతతో సమంత మరోసారి తనకు విదేశీ మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను నిరూపించుకుంది.
‘మా ఇంటి బంగారం’ సాధించిన విజయంతో మహిళా ప్రధాన కథా చిత్రాలకు టాలీవుడ్లో కొత్త దారి ఏర్పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ, ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ పరంగా అన్ని రికార్డులను అధిగమించింది. ఈ విజయంతో భవిష్యత్తులో మహిళా ప్రధాన కథలపై నిర్మాతలు మరింత ధైర్యంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ చిత్రం సమంతకు నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎంతో ప్రత్యేకం. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. సినిమా నిర్మాణంలో సమంత కీలక పాత్ర పోషించగా, క్రియేటివ్ విజన్‌ను రాజ్ నిడిమోరు అందించారు.విడుదలైన తొలి షో నుంచే ‘మా ఇంటి బంగారం’కు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.