‘దర్శకుడు సుకుమార్‌లో గొప్ప కవిహృదయం ఉంది. ఆయన సినిమాకు పాటలు రాయడం సవాల్‌గా భావిస్తుంటా. సుకుమార్‌ను ఒప్పించడం కాకుండా ప్రతి పాటతో మెప్పించే ప్రయత్నం చేస్తుంటా’ అని అన్నారు గేయరచయిత చంద్రబోస్. ఆయన సాహిత్యాన్ని సమకూర్చిన తాజా చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో చంద్రబోస్ పాత్రికేయులతో ముచ్చటించిన విశేషాలివి..
ప్రేక్షకుల ఊహలకు అందని సందర్భాలెన్నో ‘పుష్ప’ సినిమాలో ఉన్నాయి. సమాజంలోని ప్రతి వ్యక్తికి తనదైన జీవితం, జీవన సంగీతం ఉంటాయి. వారి జీవితాల్ని స్పృశిస్తూ సంగీతాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం ముఖ్యం. ఇందులో పుష్పరాజ్ గమ్యాన్ని, జీవితాన్ని అతడి కోణంలో చూపిస్తూ పాటలను రాశా. తాను జీవితాన్ని ఏ విధంగా దర్శిస్తున్నాడో ‘దాక్కో దాక్కో మేక’ పాటలో చూపించాను. ఆహారపు గొలుసుకు ఆధ్మాత్మికతను జోడిస్తూ నవ్యఆలోచనతో రాసిన పాట ఇది. పల్లవి వినిపించగానే నావైపు అభినందనపూర్వకంగా దర్శకుడు సుకుమార్ చూశారు. ఆ చూపులతోనే ఆయనకు పాట నచ్చిందని అర్థమైంది.
హీరో ఆత్మాభిమానంతో పాటు కథానాయిక పట్ల అతడికి ఉన్న ఆరాధనను వర్ణిస్తూ ‘శ్రీవల్లి’ పాట సాగుతుంది. ‘పలుకేబంగారమాయనే’ అనే కీర్తన స్ఫూర్తితో ప్రేయసి చూపుల్లో తాను పడాలని తపించే ప్రేమికుడి భావాలను పొందుపరుస్తూ రాసిన పాట ఇది. ‘చూపే బంగారమాయనే’ పదం తర్వాత యువతి పేరు ఉంటే బాగుంటుందని శ్రీవల్లి అని జోడించాం. కథానాయిక పేరు ఈ పాట నుంచే పుట్టింది.
‘సామీ.. సామీ’ పాటను చిత్తూరు యాసలో రాశా. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చిత్తూరు యాసను నేర్చుకున్నారు. సుకుమార్ చిత్తూరు యాసపై పట్టు పెంచుకొని సంభాషణలు రాశారు. వారి అంకితభావం నన్ను కదిలించింది. నేను మరింత కష్టపడాలనే భావనతో ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చా. పాటలో ‘కొత్త సీర కట్టుకుంటే యెట్టా ఉందో సెప్పకుంటే కొన్న విలువ సున్నా అవ్వదా సామీ’ అంటూ నేను రాసిన పంక్తులు చాలా ఇష్టం. ‘ఊ అంటావా ఊహూ అంటావా’ అనే ప్రత్యేక గీతం శుక్రవారం విడుదలకానుంది. సమాజంలోని ఓ అంశాన్ని కథగా మలిచి రాసిన పాట ఇది. ఈ పాటకు సమంత అందం, అభినయంచక్కగా కుదిరాయి.
సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో పాటలురాశా. ‘రంగస్థలం’ సినిమా తర్వాత మా కలయికకు బాధ్యత పెరిగింది. ఆ సినిమా కోసం కాగితంపై కలం పెట్టి ఒక్క అక్షరం రాయలేదు. పాట సందర్భాల్ని సుకుమార్ వర్ణిస్తూ ఉంటే అలవోకగా నేను చెప్పిన పదాలను పాటలుగా దేవిశ్రీప్రసాద్ స్వరపరిచారు. ఇరవై ఏడేళ్ల నా సినీ ప్రయాణంలో అదొక మధురమైన అనుభూతిగా నిలిచింది.