‘బ్యాంకింగ్, ఫైనాన్స్ కాన్సెప్ట్స్‌తో తెలుగులో ఎక్కువ సినిమా రాలేదు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి ఫ్యామిలీ డ్రామాను అందించాలనే ప్రయత్నంలోనే ‘లక్కీ భాస్కర్’ సినిమా చేశాం. ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించామనే సంతృప్తి ఉంది. సోషల్‌మీడియాతో పాటు ఎక్కడా ఈ సినిమా గురించి ఒక్క నెగెటివ్ కామెంట్ రాలేదు. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నది’ అన్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన థాంక్స్‌మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. లాంగ్న్‌ల్రో ఈ సినిమా ఇంకా అద్భుతమైన వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణ 109వ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తాం’ అన్నారు. ‘ప్రీమియర్షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మలయాళం, తమిళంలో కూడా మంచి స్పందన లభిస్తున్నది. ఈ సినిమాలో హీరో గెలిచిన ప్రతీసారి తామే గెలిచినట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఆ పాయింటే విజయానికి కారణమైంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.