దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. మీనాక్షి చౌదరి కథానాయిక. దీపావళి సందర్భంగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. 1980-90దశకంలో బ్యాకింగ్ సెక్టార్ నేపథ్య కథాంశమిది.
డబ్బు కోసం ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ ఎంతటి రిస్క్చేయడానికైనా సిద్ధపడే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ట్రైలర్లో కనిపించారు. ధనవంతుడు కావాలనే ఆయన సంకల్పం, ఈ క్రమంలో ఆయన చేసే ప్రయత్నాల నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ కంటే డబ్బిచ్చే కిక్కే వేరు’ అంటూ ట్రైలర్ చివరిలో దుల్కర్ సల్మాన్ చెప్పిన డైలాగ్ అతని మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉంది.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ…ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని, చక్కటి హాస్యంతో పాటు ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుందని, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలుంటాయని చెప్పారు. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. ఈ సినిమాలో తాను సుమతి పాత్రలో కనిపిస్తానని, ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌లో ఇదే బెస్ట్ అని కథానాయిక మీనాక్షి చౌదరి పేర్కొంది.