కరోనా మహమ్మారి వలన ఏర్పడిన పరిస్థితుల వల్ల సినిమా రిలీజ్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఏ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది, ఏ సినిమా థియటేర్లో విడుదల అవుతుంది అనే దానిపై గందరగోళం నెలకొంది. చిన్నా చితకా సినిమాలతో పాటు కొన్ని పెద్ద సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కాని జూలై నుండి థియేటర్స్ తిరిగి తెరుచుకోవడం, అభిమానులు పెద్ద ఎత్తున్న వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా థియేటర్లలో సినిమా జాతర మొదలైంది.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేస్తారని చాలా ప్రచారం జరిగిన కూడా దానిని ఖండిస్తూ కొద్ది సేపటి క్రితం రిలీజ్ డేట్ ప్రకటించారు .‘వినాయక చవితి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 10వ తేదీన చిత్రాన్నివిడుదల చేయబోతున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.
ఫిదా సినిమా తరువాత సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న లవ్ స్టోరీ సినిమా చేసే మ్యాజిక్ ఎలావుంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినిమా అభిమానులు. దానికి తోడు ‘సారంగదరియా’ పాట జనాలను ఊపేసింది. ఇంకా ఊపేస్తోంది కూడా. సారంగ దరియాలో సాయిపల్లవి డ్యాన్స్ మూవ్ మెంట్స్ లవ్ స్టోరీ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు కూడా మూవీపై రెట్టింపు అంచనాలు పెంచాయి.