e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home సినిమా Love Story : ప్రేమకథలు ఎవర్‌గ్రీన్‌

Love Story : ప్రేమకథలు ఎవర్‌గ్రీన్‌

మూడు దశాబ్దాలుగా సినిమా పంపిణీ, ప్రదర్శన రంగాల్లో అగ్రశ్రేణిలో కొనసాగుతున్నారు నారాయణ్‌దాస్‌ నారంగ్‌. మరోవైపు డిస్ట్రిబ్యూషన్‌తో పాటు చిత్ర నిర్మాణరంగంలో అపారమైన అనుభవాన్ని గడించారు నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌రావు. పరిశ్రమలో సుదీర్ఘ అనుభవమున్న వీరిద్దరి భాగస్వామ్యంలో తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మాతలు నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు పాత్రికేయులతో ముచ్చటించారు.

సంగీతం ఓ సంచలనం
‘ఫిదా’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే దర్శకుడు శేఖర్‌ కమ్ములను కలిసి ఓ సినిమా చేయమని అడిగాం. తప్పకుండా సినిమా చేస్తానని మాటిచ్చారు. అలా ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చింది. ‘లవ్‌స్టోరీ’ పాటలు సంగీతప్రియుల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో రికార్డు స్థాయి వీక్షణల్ని సొంతం చేసుకున్నాయి. విడుదలకు ముందే ఆడియో సంచలనం సృష్టించడం సినిమాపై అంచనాల్ని పెంచింది. ప్రేమకథతో పాటు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చాలా అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. శేఖర్‌ కమ్ముల శైలి సున్నితమైన భావోద్వేగాల్ని స్పృశిస్తూ ఆహ్లాదభరితంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో దాదాపు 550 థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. పరిస్థితిని బట్టి ఇంకా స్క్రీన్లను పెంచే ఆలోచన ఉంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే నిజమైన ఫీల్‌ను ఆస్వాదిస్తాం. తమిళం, మలయాళంలో డబ్బింగ్‌ వెర్షన్‌ను సిద్ధం చేశాం. అయితే అక్కడ ఇంకా థియేటర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని కారణంగా విడుదల చేయడం లేదు.

- Advertisement -

థియేటర్ల ఆక్యుపెన్సీ బాగుంది..
ప్రస్తుతం థియేటర్లలో ఆక్యుపెన్సీ బాగా ఉంది. ఇటీవల విడుదలైన ‘పాగల్‌’ ‘ఎస్‌.ఆర్‌.కల్యాణమండపం’ చిత్రాలు మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ‘సీటీమార్‌’కు ఓపెనింగ్‌ కలెక్షన్స్‌ బాగా వచ్చాయి. ఈ పరిణామాల్ని గమనిస్తే థియేటర్లు తిరిగి కళకళలాడుతున్నాయని అర్థమవుతున్నది. తరాలు మారుతున్నా ప్రేమకథా చిత్రాలు ఎవర్‌గ్రీన్‌గా అలరిస్తుంటాయి. ‘లవ్‌స్టోరీ’లో కథావిష్కరణ విభిన్నంగా ఉంటుంది.

సామాన్యుల వినోదం సినిమానే
ఓటీటీల ప్రభావం వల్ల థియేటర్లకు ఏమాత్రం ఆదరణ తగ్గిపోదు. సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల వ్యవస్థ కుప్పకూలిపోతుందనే వార్తలు ప్రతిసారి వినిపిస్తూనే ఉంటాయి. ఒకనాడు లక్షల్లో ఉన్న తారల పారితోషికాలు నేడు కోట్లకు చేరుకున్నాయి. అలాంటప్పుడు థియేటర్లు కనుమరుగైపోతాయనడంలో అర్థం లేదు. మరో పదేళ్లలో సినిమా బిజినెస్‌ మూడింతలు అవుతుందని అంచనా వేస్తున్నాం. పరిశ్రమ స్థాయి మరింతగా పెరుగుతుంది. ఇప్పటికి సామాన్యులకు అతి చవకైన వినోదసాధనం సినిమానే.

థియేటర్లను ఫీడ్‌ చేయడం కష్టం
ఆంధ్రప్రదేశ్‌లో టిక్కెట్ల రేట్లకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ప్రభుత్వం ఆ సమస్యను సరైన రీతిలో అర్థం చేసుకోలేదని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లలో థియేటర్లను ఫీడ్‌ చేయడం చాలా కష్టమవుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా అతితక్కువ ధరల్లో ఏపీలో టిక్కెట్‌ రేట్లను నిర్ణయించారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పరిశ్రమ ప్రతినిధులు చర్చలు జరుపబోతున్నారు. అందులో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. ఇక ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థను తీసుకురావడంలో ఏమాత్రం తప్పులేదు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని తీసుకురావాలని నిర్మాతలే కోరుతున్నారు. తెలంగాణలో కూడా నాలుగేళ్ల క్రితమే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అనివార్య కారణాల వల్ల ఆ విధానానికి బ్రేక్‌ వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ టికెటింగ్‌కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ విధానాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు.

వచ్చే ఏడాది ఎనిమిది సినిమాలు
మా సంస్థలో పది చిత్రాలు నిర్మాణం కాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది హీరోలతో ఒప్పందాలు చేసుకున్నాం. రాబోవు సంవత్సరకాలంలో ఎనిమిది చిత్రాల్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేశాం. నాగశౌర్యతో చేస్తున్న ‘లక్ష్య’ సినిమాను నవంబర్‌లో విడుదల చేయబోతున్నాం. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌సత్తారు రూపొందిస్తున్న సినిమా షూటింగ్‌ జరుగుతున్నది. ఫిబ్రవరిలో రిలీజ్‌ చేస్తాం. ధనుష్‌, సుధీర్‌బాబు, శివకార్తికేయన్‌ కథానాయకులుగా వరుస సినిమాలు చేయబోతున్నాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement