Love After Divorce | ప్రేమ అంటే ఒక్కసారి పుట్టేది కాదు అనేకసార్లు పునరాగమనం చేస్తుందని టాలీవుడ్ సెలబ్రిటీలే నిరూపిస్తున్నారు.! మొదట ప్రేమ వివాహం చేసుకుని లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని.. మనస్పర్థల వలన విడిపోయి డివోర్స్ తర్వాత కూడా మళ్లీ ప్రేమలో పడిన జంటలను ప్రస్తుత జనరేషన్లో చాలవరకు చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్‌లో బాలీవుడ్‌కి ఏం తీసుకపోం అన్నట్లు టాలీవుడ్ సెలబ్రీటీలు కూడా ఫాలో అవుతున్నారు. అయితే మొదట వివాహం డివోర్స్ అయిన తర్వాత మళ్లీ ప్రేమ వివాహం చేసుకున్న టాలీవుడ్ జంటలను ఒకసారి చూసుకుంటే.
1.పవన్ కల్యాణ్
ఈ ట్రెండ్‌లో అందరికంటే ముందుంటాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ తన వ్యక్తిగత జీవితంలో ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నారు. ఆయన మొదటి పెళ్లి 1997లో నందినితో జరిగింది. ఆ తర్వాత విడిపోయారు. తరువాత రేణు దేశాయ్‌తో ప్రేమలో పడగా వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట కూడా అనుకోని కారణాలతో 2012లో విడాకులు తీసుకుంది. అనంతరం తీన్మార్ షూటింగ్ సమయంలో పరిచయమైన రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను ప్రేమించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకున్నారు పవన్.
2. నాగార్జున..
అక్కినేని నాగార్జున ఇప్పటివరకు రెండు సార్లు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. మొదట 1984లో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుమార్తె లక్ష్మి దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. వారికి నాగా చైతన్య జన్మించారు. 1990లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత, ‘శివ’ సినిమా సెట్స్‌లో సహనటి అమలాతో ప్రేమలో పడి, 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్ అక్కినేని జన్మించారు. 30 ఏళ్లు దాటినా వీరి బంధం ఇప్పటికీ దృఢంగా ఉంది.
3. ప్రకాష్ రాజ్
నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇప్పటివరకు రెండు సార్లు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. మొదట1996లో తమిళ నటి లలితా కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కోరియోగ్రాఫర్ పోనీ వర్మాతో ప్రేమలో పడి 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రకాష్ రాజ్ తన రెండో ప్రేమ జీవితం తన జీవితాన్ని మార్చిందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
4. నాగ చైతన్య
అక్కినేని వారసుడు నాగ చైతన్య కూడా ఇప్పటివరకు రెండు సార్లు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. మొదట నటి సమంతను ప్రేమ పెళ్లి చేసుకున్న చైతూ వ్యక్తిగత కారణాలతో విడిపోయాడు. అనంతరం తెలుగు నటి శోభితా ధుళిపాళతో ప్రేమలో పడి ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు.
5. సమంత రూత్ ప్రభు
టాలీవుడ్ క్వీన్ సమంత కూడా మళ్లీ పెళ్లి చేసుకుంది. తన మొదటి ప్రేమ వివాహం నాగచైతన్యతో 2017లో గ్రాండ్‌గా జరుగగా.. 2021లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకున్న అనంతరం దాదాపు 4 ఏండ్లు ఒంటరిగా ఉన్న ఈ అమ్మడు తాజాగా మళ్లీ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుని డిసెంబర్ 1న వివాహం చేసుకుంది. కోయంబత్తూర్ ఈషా యోగా సెంటర్లో సాదాసీదాగా ఈ వివాహం జరిగినట్లు సమాచారం.
6.మంచు మనోజ్
మంచు మనోజ్ మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని 2015లో ప్రేమ వివాహం చేసుకోగా.. 2019లో ఈ జంట విడిపోయింది. అనంతరం భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడిన మనోజ్ 2023లో పెళ్లి చేసుకున్నాడు. ఇంకా వీరే కాకుండా సీనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ నటుడు వీకే నరేష్ కూడా తమ జీవితంలో రెండు సార్లు వివాహాబంధంలోకి వెళ్లారు.