Balagam | తెలంగాణ కుటుంబ విలువలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలకు పట్టం కట్టిన ‘బలగం’ సినిమా శుక్రవారం ప్రకటించిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో విస్మరణకు గురైంది. ఓ చావు నేపథ్య కథలో విస్తారమైన జీవన తాత్వికతను ఆవిష్కరించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు ఖాయమని సినీ ప్రియులందరూ భావించారు. జాతీయ పురస్కారం మిస్ అయిందనుకుంటే, కనీసం తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఎంపిక చేయకపోవడం ప్రేక్షకులకు విస్మయానికి గురిచేసింది. ఈ తెలంగాణ మట్టి కథపై అవార్డుల సెలక్షన్ జ్యూరీ ఉద్దేశ్యపూర్వకంగా వివక్షను ప్రదర్శించిందనే విమర్శలొస్తున్నాయి. జాతీయ అవార్డుల ఎంపికలో సామాజిక ప్రయోజనంతో పాటు మానవీయ సంబంధాలు, సాంస్కృతిక చైతన్యం కలిగించే చిత్రాలకు పెద్దపీట వేస్తారు. అలాంటి అంశాలు పుష్కలంగా ఉండి సమకాలీన తెలంగాణ సినిమాకు నూతన జవసత్వాలు అందించిన చిత్రంగా అభివర్ణింపబడిన ‘బలగం’ చిత్రాన్ని ఏ కారణాలతో విస్మరించారని సినీ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
వేణు యెల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి , కావ్య కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, రూపలక్ష్మి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో దిల్‌రాజు ‘బలగం’ చిత్రాన్ని రూపొందించారు. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ సినిమా తెలంగాణ గ్రామాలన్నింటిని కదిలించింది. దండోరా వేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. ఓ నలభైయాభై ఏళ్ల క్రితం ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు విడుదలైతే వాటిని ఊరి పండుగలు, ఉత్సవాల్లో ప్రదర్శించేవారు. గ్రామీణులు బళ్లు కట్టుకొని సినిమాలు చూడ్డానికి వెళ్లేవారు. ‘బలగం’ విడుదలైన తర్వాత తెలంగాణ పల్లెల్లో మరలా అలాంటి దృశ్యాలు ఆవిషృ్కతమయ్యాయి. ఈ సినిమా ప్రదర్శనకు గ్రామ కూడళ్లు వేదికలయ్యాయి. బొడ్రాయి దగ్గర తెరలు కట్టి సినిమాను ప్రదర్శిస్తే ఊరి జనమంతా సినిమా చూస్తూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ప్రజలు సామూహికంగా గ్రామ వేదికల్లో వీక్షించడం అరుదైన విషయంగా చెప్పుకున్నారు. ఎలాంటి కృత్రిమ హంగులు లేకుండా తెలంగాణ గ్రామీణ కుటుంబ అనుబంధాలను సహజంగా, స్వచ్ఛంగా దృశ్యమానం చేసిన ఈ సినిమాతో యావత్ తెలంగాణ సమాజం బాగా కనెన్ట్ అయింది. ఇంతలా జనబాహుళ్యాన్ని ప్రభావితం చేసిన సినిమాను జాతీయ అవార్డుల్లో పక్కనపెట్డడం తెలంగాణ ప్రాంతీయ సినిమాకు అన్యాయం చేయడమేనని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బలగం’ చిత్రానికి ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డు రాకపోవడంతో ఇక గ్రామీణ జీవితాలను దృశ్యమానం చేస్తూ, మానవీయ స్పృహతో నిర్మించే చిత్రాలకు అవార్డులను ఆశించడం వృథా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘బలగం’ సినిమా కోసం దర్శకుడు వేణు యెల్దండి ఎంతగానో శ్రమించారు. కొన్నేళ్లు పరిశోధన చేసి ప్రామాణికమైన అంశాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి ప్రాంత నేపథ్య కథలు విరివిగా వచ్చాయి. సొంత రాష్ట్రంలో స్వీయ అస్తిత్వాన్ని చాటుతూ తెలంగాణ దర్శక రచయితలు సరికొత్త కథాంశాలతో ప్రతిభను చాటారు. ఈ కోవలో వచ్చిన చిత్రాల్లో ‘బలగం’ అత్యంత ప్రభావవంతమైన చిత్రంగా నిలిచింది. అందుక్కారణం ఈ సినిమా స్పృశించిన మానవీయ, సాంస్కృతిక అంశాలే. ఈ సినిమా చూసిన వారు తమ కుటుంబాలను తెరపై చూసుకున్న అనుభూతికిలోనయ్యారు. రక్త సంబంధాల బలగం ఎంత గొప్పదో తెలుసుకున్నారు.
‘బలగం’ ప్రభావంతో గొడవలతో విడిపోయిన తోబుట్టువులు, కుటుంబాలు ఒక్కటైన దృశ్యాలు కనిపించాయి. కొన్ని కుటుంబాలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకొని తమ అనందాన్ని పంచుకున్నారంటే ‘బలగం’లోని భావోద్వేగాలు ప్రజల్ని ఎంతగా కదిలించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో సామాజిక పరివర్తనకు దోహదం చేసిన కథ జాతీయ అవార్డుల జ్యూరీకి ఎందుకు నచ్చలేదన్నది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు ప్రాంతీయ సినిమాలను ఎంత గొప్పగా తీసినా లాబీయింగ్ లేకపోతే అవార్డులు దక్కించుకోవడం అసాధ్యమనే భావన నెలకొంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలిగే రాజకీయ పార్టీలో లేదా వారి తాలూకు పరపతి కలిగిన వ్యక్తుల సిఫార్సు ఉంటే ఎలాంటి సినిమాకైనా అవార్డు తీసుకొని రావొచ్చన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పునర్వికాసం దిశగా పయనిస్తున్న తెలంగాణ ప్రాంతీయ సినిమా అస్తిత్వాన్ని అంగీకరించలేని కొందరు పెద్దల వల్లే ‘బలగం’ లాంటి సినిమా జాతీయ అవార్డుల్లో నిర్లక్ష్యానికి గురైందనే వాదన వినిపిస్తున్నది.
బిజేపీ ప్రభుత్వ హయాంలో జాతీయ చలన చిత్ర అవార్డులు ఓ ప్రహసనంలా మారాయని, వాటి తాలూకు గౌరవం తగ్గిపోయిందని, రాజకీయ ప్రయోజనాల కోణంలోనే అవార్డులను సిఫార్సు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రదానం చేసిన అవార్డులను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో యథార్థ జీవితానికి పట్టం కట్టిన చిత్రాలు, సాంఘిక ప్రయోజనాత్మక చిత్రాలు, గ్రామీణ కథలకు ప్రాధాన్యతనిచ్చేవారు.
కానీ బీజేపీ హయాంలో పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసే ధోరణి పెరిగిందని, హీరోల తాలూకు ఇమేజ్ను రాజకీయపరంగా క్యాష్ చేసుకునేందుకు అవార్డులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. ముఖ్యంగా బిజెపీ పార్టీ తాలూకు సైద్ధాంతిక అజెండాను ప్రచారం చేసే ప్రాపగాండ మూవీస్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, మొత్తంగా జాతీయ అవార్డుల్లో రాజకీయజోక్యం మితిమీరిపోయిందనే అభిప్రాయలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.