Shraddha Kapoor | “స్త్రీ-2’ నా కెరీర్‌కి ఊహించని వరం. ఈ స్థాయి విజయాన్ని నేనెన్నడూ ఊహించలేదు. ఖాన్ సినిమాలకు వచ్చే కలెక్షన్లు కథానాయిక నేపథ్య చిత్రానికి రావడం నిజంగా ఆశ్చర్యం. ప్రస్తుతానికి దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆరోస్థానంలో ‘స్త్రీ-2’ ఉంది. ఇంకా వసూళ్లు బాగానే ఉన్నాయని, ఈ లెక్కలు కూడా మారే ఛాన్సుందని చెబుతున్నారు.’ అంటూ ఆనందం వెలిబుచ్చింది శ్రద్ధా కపూర్. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం “స్త్రీ -2’.
2018లో వచ్చిన హిట్ సినిమా ‘స్త్రీ’ చిత్రానికి ఇది సీక్వెల్. రాజ్‌కుమార్‌రావ్ కీలకపాత్ర పోషించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకుడు. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా 39రోజుల్లో 604కోట్ల షేర్, 713కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ విజయం గురించి శ్రద్ధా ఆసక్తికరంగా మాట్లాడింది. ‘పెద్ద స్టార్లు లేకపోయినా కథను ఆసక్తికరంగా చెబితే జనం ఆదరిస్తారని ‘స్త్రీ 2’తో రుజువైంది. ఈ ఫ్రాంచైజీ కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నా. ‘స్త్రీ 3’కోసం నేనూ ఈగర్లీ ఎదురు చూస్తున్నా.’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధా.