Lokesh Kanagaraj | తమిళ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవలి కాలంలో సూపర్ హిట్ చిత్రాలు చేస్తూ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ సినిమాల ద్వారా ఆయన తనదైన మార్క్ చూపించారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్‌తో తెరకెక్కించిన ‘కూలీ’ సినిమాతో సందడి చేయనున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో నాగార్జున, సత్యరాజ్, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. లోకేష్ గతంలో దళపతి విజయ్‌తో చేసిన ‘లియో’ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన పొందింది. ముఖ్యంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పాత్ర అభిమానులను అంతగా ఆకట్టుకోలేదు. పాత్రకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.
ఇటీవల సంజయ్ దత్ కూడా ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోకేష్ కనగరాజ్ నన్ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నా క్యారెక్టర్ చాలా చిన్నదిగా, ప్రభావం లేనిదిగా చూపించాడు. నన్ను వేస్ట్ చేసుకున్నాడు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అనేకమంది నెటిజన్లు సంజయ్ దత్ మాటలతో ఏకీభవిస్తూ, లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ‘కూలీ’ ప్రమోషన్లో పాల్గొన్న లోకేష్ ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. సంజయ్ సార్ మాటల్లో నిజం ఉంది. ‘లియో’లో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేకపోయాను. అది నా తప్పు. ఇప్పుడు నేను గుర్తించాను. భవిష్యత్తులో ఒక అవకాశం వస్తే, ఆయన ఇమేజ్‌కి తగిన పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తా. ఈ విషయంలో ఆయనను క్షమించమని కోరుతున్నా అని అన్నారు.
లోకేష్ స్పందనపై నెటిజన్లు ప్రశంసిస్తూ, “ఇది నిజమైన ఫిల్మ్ మేకర్ చూపించే లక్షణం” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనితో ‘లియో’ వివాదం ముగిసినట్టే అనిపిస్తోంది. ‘కూలీ’ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్, హీరో కార్తీతో ‘ఖైదీ 2’ కోసం రెడీ అవుతున్నారు. ఇది కూడా ‘లూకేయ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగమే కావడం విశేషం. ఈ సినిమాలో సంజయ్ దత్‌కి ఏమైన అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. ఇక సంజయ్ దత్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువగా నటిస్తున్నారు. కన్నడలో ‘కేడీ – ది డెవిల్’, తెలుగులో ‘ది రాజా సాబ్’, ‘అఖండ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు.