Little Hearts | సెప్టెంబర్ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు సినిమా అభిమానుల నోట తెగ నానుతుంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ ఔరా అనిపిస్తోంది. 90s బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శివాని నాగరం హీరోయిన్గా అలరించారు.సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ పై నిర్మించారు. తొలుత ఈ సినిమాను ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలని భావించినా, ఫైనల్ కట్ చూసిన తర్వాత నిర్మాతలు బన్నీ వాస్ & వంశీ నందిపాటి కలిసి రూ. 2 కోట్లకు రైట్స్‌ను కొనుగోలు చేసి థియేటర్స్‌లో రిలీజ్ చేశారు.
రిలీజ్‌కి ముందే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా వచ్చిన పాజిటివ్ బజ్, ఫస్ట్ డే నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ షోలు తెచ్చిపెట్టింది. తొలి రోజు ఈ చిత్రం ₹1.35 కోట్లు వసూళ్లు రాబట్టగా, రెండో రోజు రెట్టింపు వసూళ్లు వచ్చాయి. ఆరో రోజులు పూర్తయ్యే సరికి ఈ మూవీ ₹2.75 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రానికి సంబంధించి 1153 షోస్ వేయగా.. రూ.1.93 కోట్లు వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా లిటిల్ హార్ట్స్ మూవీ రూ.21 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం అందుతుంది. మరికొన్ని రోజుల్లో రూ.25 కోట్ల క్లబ్ లోకి సినిమా అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమా కథ యూత్ మైండ్‌సెట్‌కు బాగా కనెక్ట్ కావడం, ఎమోషనల్ & రొమాంటిక్ టచ్ ఉండడం సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఫస్ట్ షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్, మౌత్ టు మౌత్ ప్రమోషన్ ద్వారా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. కథ బలంగా ఉంటే, స్టార్ కాస్టింగ్ లేకపోయినా విజయం సాధించొచ్చు అని లిటిల్ హార్ట్స్ మూవీ మరోసారి నిరూపించింది. చిన్న సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ చూస్తుంటే, ఇది త్వరలో భారీ వసూళ్లతో ఓ మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.