‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, శివాని నాగారం జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’. సాయిమార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఆదిత్యహాసన్ నిర్మాత. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాతలు బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీవాస్ మాట్లాడుతూ ‘యంగ్ టీమ్‌కు ఫ్రీడమ్ ఇస్తే ఎలాంటి అద్భుతాలు చేస్తారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఈటీవీ విన్ నుంచి ఇటీవలకాలంలో క్రియేటివ్ కంటెంట్ వస్తున్నది. అదే కోవలో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం ప్రచార కార్యక్రమాలతోనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసిందని, తప్పకుండా అందరికి నచ్చుతుందని హీరో శ్రీవిష్ణు అన్నారు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా అందరిని నవ్వించడంతో పాటు హృదయాల్ని గెలుచుకుంటానని హీరో మౌళి తనుజ్ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.