Pawan Kalyan | హనుమకొండలో కొద్దిరోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన చిన్నారి నిరంజన్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ వార్త పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కొద్ది రోజుల క్రితం హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన క్షణాలు ఇంకా తన మదిలో సజీవంగానే ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే తన కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి, నన్ను చూడగానే ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచిందని కొనియాడారు. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల ఆ చిన్నారి చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవని, అలాంటి ధైర్యవంతుడైన నిరంజన్ ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రియమైన నిరంజన్ చూపించిన చిరునవ్వు, ధైర్యం, పంచిన ప్రేమ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో నివాళులర్పించారు.