Highest Grossing Re-released Indian Movies | ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాలతో పాటు క్లాసిక్‌లను మళ్లీ విడుదల చేసి కోట్లు సంపాదిస్తున్నారు చిత్ర నిర్మాతలు. అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన చిత్రాల నుంచి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూసుకుంటే మొదటి స్థానంలో హిందీ చిత్రం తుంబాడ్ నిలిచింది. ఇక ఇండియా నుంచి రీ రిలీజ్ అయ్యి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలను ఒకసారి చూసుకుంటే..
తుంబాడ్
Tumbbad
లాక్డౌన్ టైంలో ఓటీటీలో పాపులర్ అయిన చిత్రాలలో తుంబాడ్ ఒకటి. 2018లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టడమే కాకుండా రూ.13 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం, కరోనా రావడంతో ప్రేక్షకుల ఆసక్తి చూపలేదు. అయితే లాక్డౌన్ టైంలో ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా దశ పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఇంత మంచి సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యామంటూ కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హిందీ భాషలో రీ రిలీజ్ అవ్వగా.. రీ రిలీజ్ అయిన సినిమాలలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఏ సినిమాకు రానివిధంగా ఈ చిత్రం రూ.37 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో రీ రిలీజ్ అయిన చిత్రాలతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ చిత్రం రికార్డు సాధించింది.
దళపతి విజయ్ గిల్లీ
Ghilli
సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఒక్కడు. ఈ సినిమా తమిళంలో గిల్లీ అనే పేరుతో రీమేక్ అయ్యింది. దళపతి విజయ్ కథానాయకుడిగా నటించగా.. త్రిష హీరోయిన్గా నటించింది. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ని అందుకోవడమే కాకుండా విజయ్‌కి మంచి మాస్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టింది. అయితే ఇదే సినిమాను గత ఏడాది రీ రిలీజ్ చేయగా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.32 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
యే జవానీ హై దీవానీ
Ye Jawani Ye Diwani
బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం
యే జవానీ హై దీవానీ. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2013లో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను రీసెంట్గా మేకర్స్ రీ రిలీజ్ చేయగా.. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
సనమ్ తేరీ కసమ్
Sanam Teri Kasam
తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకేన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సనమ్ తేరీ కసమ్. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు రాధికా రావు, వినయ్ సప్రు కథను అందించడంతో పాటు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యాక ప్రశంసలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ రీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా రీ రిలీజ్ అయిన అనంతరం ప్రేక్షకుల థియేటర్లకు క్యూ కట్టడం మొదలుపెట్టారు. దీంతో వారంలోనే రూ.26 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.
ఇంకా ఇవే కాకుండా అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర నటించిన షోలే (రూ.13 కోట్లు), రణబీర్ కపూర్ నటించిన రాక్‌స్టార్ (రూ.12 కోట్లు), లైలా మజ్ను(రూ.కోట్లు), మహేశ్ బాబు మురారి(రూ.9 కోట్లు). పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్(రూ.8 కోట్లు), ఎన్టీఆర్ సింహాద్రి(రూ.4.60 కోట్లు) తదితర సినిమాలు ఉన్నాయి.