LEPRA Society | కుష్టువ్యాధి నిర్మూలనకు కృషిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ (NGO) లెప్రా సొసైటీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుండి అరుదైన గౌరవం లభించింది. ఆరోగ్య రంగంలో లెప్రా చేస్తున్న విశేష సేవలకు గాను WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సౌత్ – ఈస్ట్ ఏషియా రీజియన్ ‘పబ్లిక్ హెల్త్ ఛాంపియన్ (ఇనిస్టిట్యూషన్ కేటగిరీ)’ అవార్డును ప్రదానం చేసింది.
ఈ అవార్డుకు ప్రధాన కారణం లెప్రా సొసైటీ అభివృద్ధి చేసిన ‘DiMPLE (డిజిటల్ మెజర్మెంట్ ఫర్ పడుకా)’ అనే వినూత్న సాంకేతికత. కుష్టువ్యాధి కారణంగా కాళ్లలో సమస్యలు ఉన్నవారి కోసం ఈ టెక్నాలజీని రూపొందించారు. DiMPLE ద్వారా డిజిటల్‌గా పాదాల కొలతలు, చిత్రాలను సేకరించి, వారికి సరిపోయే కస్టమ్-మేడ్ పాదరక్షలను తయారు చేస్తారు. ఈ పాదరక్షలు కుష్టువ్యాధిగ్రస్తుల జీవిత నాణ్యతను మెరుగుపరిచి, వారికి స్వావలంబన కల్పిస్తాయి.
1989లో స్థాపించబడిన లెప్రా కుష్టువ్యాధి సంరక్షణలో ముందంజలో ఉంది. వికలాంగత నివారణ కోసం ప్రత్యేకంగా పాదరక్షలను రూపొందించే సాంకేతికతలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ 11 రాష్ట్రాలలో తన సేవలను అందిస్తోంది. కుష్టువ్యాధితో పాటు, క్షయవ్యాధి (టీబీ), హెచ్ఐవీ, బోధకాలు, మరియు కోవిడ్-19 వంటి ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. పరిశోధన, ఆవిష్కరణ మరియు కరుణతో కూడిన వైద్య సేవలను అందిస్తూ, వ్యాధిగ్రస్తులపై ఉన్న సామాజిక వివక్షను తగ్గించడానికి కృషి చేస్తోంది.
ఈ అవార్డు సందర్భంగా లెప్రా సీఈఓ ప్రశాంత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ.. ఈ అవార్డు మా ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు మరియు భాగస్వాముల అంకితభావాన్ని ప్రతిబింబిస్తోంది. నిరంతర సహకారం మరియు విరాళాలతో, మేము DiMPLE వంటి వినూత్న ఆవిష్కరణలను విస్తరించి, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించగలము అని అన్నారు.