అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే కథాంశమిది. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. మంగళవారం అఖిల్ పుట్టినరోజుని పురస్కరించుకొని టైటిల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.
ఇందులో అఖిల్ గుబురు గడ్డం, మీసాలతో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. ‘గతాన్ని తడుముకుంటూ పోతూ మా నాయనా ఓ మాట చెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా.. పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని’ అంటూ అఖిల్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.
విజువల్స్ కట్టిపడేశాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రేమకోసం కథానాయకుడి పోరాటం, సంఘర్షణ ప్రధానాంశాలుగా ఉంటాయని గ్లింప్స్‌ను చూస్తే అర్థమవుతున్నది. భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.