Drishyam 3 | ధురంధర్ సినిమాతో స్టార్‌గా మారిన బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తాజాగా వివాదంలో ఇరుక్కున్నాడు. బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోగా.. ఈ విషయంపై చిత్ర నిర్మాత మంగత్ పాఠక్ అతడికి నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. గత రెండేళ్లుగా ఎంతో కష్టపడి సిద్ధం చేసిన ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు అక్షయ్ ఎంతో ఉత్సాహం చూపించారని, అందుకే ఆయనకు భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించి అధికారికంగా ఒప్పందం చేసుకున్నామని నిర్మాత వెల్లడించారు. అయితే షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో, తాను ఈ సినిమాలో నటించడం లేదంటూ కేవలం ఒక టెక్స్ట్ మెసేజ్ పంపి అక్షయ్ తప్పుకున్నట్లు నిర్మాత తెలిపాడు. ఈ విషయాన్ని చర్చించేందుకు నిర్మాత ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని సమాచారం. ఇదిలా ఉంటే, సినిమా పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు చిత్ర బృందం అక్షయ్ ఖన్నా స్థానంలో ప్రతిభావంతుడైన నటుడు జైదీప్ అహ్లావత్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ లీగల్ నోటీసులపై అక్షయ్ ఖన్నా నుంచి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాలి.