Ravi Kishan | బీజేపీ ఎంపీ, సినీ నటుడు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రవి కిషన్‌కి మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఈసారి ఆ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చినట్లు సమాచారం. ఈ మెసేజ్ రవి కిషన్‌కు పూజలు నిర్వహించే జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్‌ఫోన్‌కు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రవీణ్ శాస్త్రి రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ విహార్ విస్టర్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 4న తనకు 7904161800 నంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి మాట్లాడుతూ “ఈసారి మోదీ, యోగి ఇద్దరూ గెలవరు” అని, తనను చంపుతానని, ఎంపీ రవి కిషన్‌ను కూడా చూసుకుంటానని బెదిరించాడు అని చెప్పుకొచ్చాడు.
తర్వాత వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌లో రవి కిషన్ మరియు బీజేపీ ఎమ్మెల్యే ప్రదీప్ శుక్లా ఫోటోలపై X మార్క్ వేసి ఉందని ప్రవీణ్ తెలిపారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నంబర్ ప్రొఫైల్ పిక్‌లో లారెన్స్ బిష్ణోయ్ ఫోటో ఉందని చెప్పారు. ప్రవీణ్ శాస్త్రి, రవి కిషన్ ఇంట్లో తరచుగా పూజలు నిర్వహించే వ్యక్తి. ఆయన తెలిపిన ప్రకారం, గతంలో కూడా రవి కిషన్‌కు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, ఆ కేసులో ఒకరిని గోరఖ్‌పూర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారని తెలిపారు. ఈ బెదిరింపు తర్వాత ప్రవీణ్ శాస్త్రి రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ టీమ్ కూడా బెదిరింపు నంబర్ మూలాలను వెతికే పనిలో పడింది.
ప్రవీణ్ శాస్త్రి మాట్లాడుతూ, “రవి కిషన్ నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన భద్రతను పెంచాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగం అప్రమత్తమైంది. రవి కిషన్ భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయనున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం కూడా తనకు బెదిరింపు కాల్స్ రావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించాడు రవి కిషన్. నేను ఈ బెదిరింపులకు భయపడను. వాటికి తలవంచనని స్పష్టంగా చెబుతున్నాను. ప్రజా సేవ, జాతీయవాదం, ధర్మ మార్గంలో నడవడం నాకు రాజకీయ వ్యూహం కాదు.. ఇది జీవిత సంకల్పం. నేను ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చినా, ప్రతి పరిస్థితిలోనూ ఈ మార్గంలో స్థిరంగా ఉంటాను అని పేర్కొన్నారు.