Happy Birhday Movie Teaser | విభిన్న కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక లావణ్య త్రిపాఠి. ‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల చూపును తన వైపు తిప్పుకుంది. ఈ చిత్రం తర్వాత అవకాశాలు క్యూ కట్టాయి. సినిమాల ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులను అలరించడంలో మాత్రం లావణ్య ఎప్పుడు ముందుంటుంది. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యపీ బర్త్‌డే’. ‘మత్తు వదలరా’ వంటి బ్లక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన రితేష్ రానా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే విడుదలైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.
‘ఆయుధాల చట్టం అంటే ఏంటి సుయోధన.. ఇంటింటికి గన్, ఎదురులేని ఫన్’ అంటూ టీజర్ మొదలైంది. ‘నేను టెన్త్ ఫేయిల్ అయ్యుండోచ్చు కానీ.. గన్బిల్ మాత్రం పాస్ చేసే తీరుతా’ అంటూ వెన్నెల కిషోర్ చెప్పే డైలాగ్ హస్యాస్పదంగా ఉంది. ఆయుధాల చట్టం కోసం పోరాడుతున్న మంత్రిగా కిషోర్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది. ‘దేశం నలుమూలలా అంబరాన్నంటిన సంబురాలు. గల్లీ గల్లీకి ఏర్పడిన గన్ బజార్ అంటూ’ వచ్చిన డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చివర్లో ‘అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని వెన్నెల కిషోర్‌ను అడుగుతుంటే.. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనే అడిగే బదులు.. మీకెందుకు రాలేదని సిగ్గుపడండి’ అంటూ కిషోర్ పలికే సంభాషణ నవ్వులు పూయిస్తుంది.
టీజర్‌ను గమనిస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాల భైరవ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సురేష్ సరంగం కెమెరా విజువల్స్ బాగున్నాయి. వివేక్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలు నిర్మించాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 15న విడుదల కానుంది.