Apsara Vydyula : ప్రముఖ నేపథ్య గాయని, దివంగత ఎస్.జానకి(S Janaki) మనువరాలు అప్సర విద్యుల (Apsara Vydyula) తనపై వస్తున్న విమర్శలపై స్పందించింది. . జూలై12 ఆదివారం నానమ్మ అంత్యక్రియల సమయంలో అప్సర ఏడవలేదని, ఆమెకు బాధే లేదని నెట్టింట పుట్టుకొస్తున్న ట్రోల్స్‌కు సోషల్ మీడియా పోస్ట్‌తో కౌంటర్ ఇచ్చింది. ‘కన్నీళ్లు కారిస్తేనే బాధ ఉన్నట్టా? కొన్నిసార్లు దుఃఖం అనేది వ్యక్తిగతం.. అయినా నానమ్మపై నాకున్న ప్రేమను కన్నీళ్లతో లెక్కకట్టొద్దు’ అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించింది అప్సర.
‘ఈ ప్రపంచంలో మా నానమ్మకు ఎంతో ఇ్టమైన వ్యక్తి నా సోదరి వర్ష. వారిద్దరూ ఒకేలా ఉండేవారు. ఒకరినొకరు బాగా అర్ధం చేసుకునేవారు. చెప్పాలంటే ఒకరిఒకరు అనేలా ఉండేవారు. నానమ్మ అంత్యక్రియల వేళ నా స్థానంలో వర్ష ఉండాల్సింది. కానీ, నానమ్మను చూసుకోవడం, అన్ని పనులు పూర్తి చేయడం నా బాధ్యత అయ్యాయి. ఎందుకుంటే.. 2023 ఆగస్టులో వర్ష మరణించింది. ఆమె దూరమైన బాధ నుంచే మా కుటుంబం ఇంకా బయటపడలేదు. దుఃఖం ఎప్పూడు మాయమవ్వదు. అది జీవితాంతం మనతోనే ఉంటుంది.
నానమ్మ జానకి అంత్యక్రియల సమయంలోనేను బాధ పడలేదని, కన్నీళ్లు పెట్టుకోలేదని చాలామంది కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. మీరు చూసిన, చూడని నా కన్నీళ్లతో నానమ్మపై నాకున్న ప్రేమను లెక్కకట్టొద్దని టోలర్స్కు విజ్ఞప్తి చేస్తున్నా. ఆధ్యాత్మిక ప్రదేశం నుంచి మరణం వస్తుందని నానమ్మ మాకు చెప్పేవారు. ప్రాణం లేకున్నా సరే ప్రేమ ఆగిపోదని ఆమె చెబుతుండేవారు. జ్ఞపకాలే నన్ను ద్రుఢంగా మార్చేశాయి.
బాధ అనేది ఎల్లప్పుడూ బయటకు కనిపించదు. కొన్నిసార్లు అది మౌనం దాలుస్తుంది. చెప్పాలంటే అది పూర్తిగా వ్యక్తిగతం’ అని అప్సర వెల్లడించింది. జానకి కుమారుడు మురళీ కృష్ణ రెండో కూతురు అప్సర. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదంలో ఆమె తండ్రిని కోల్పోయింది. సోదరుడు సైతం మరణించడంతో అప్సరనే నానమ్మ జానకి అంత్యక్రియల్లో పాల్గొని.. తలకొరివి పెట్టారు. ఈత, యోగా, ఫిట్నెస్ శిక్షకురాలైన అప్సరకు ఇన్‌స్టాలో 44 వేలమంది ఫాలో అవుతున్నారు.
గుండెపోటుతో కన్నుమూసిన సుప్రసిద్ధ గాయని శిష్ట్ల జానకి అంత్యక్రియలను కర్నాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. మైసూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని కనియనహుండిలో ఉన్న ఫార్మ్‌హౌజ్‌లో ఆమె పార్థీవదేహాన్ని ఖననం చేశారు. కుమారుడు, మనవడు ప్రమాదంలో చనిపోయినందున మనవరాలు అప్సర విద్యుల తలకొరివి పెట్టారు. ఆంధ్ర బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో జానకి అంత్యక్రియలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన జానకి.. మూడేళ్లకే సంగీతంపై ఆసక్తి పెంచుకుంది. పదేళ్లకే పాటందుకున్న జానకమ్మ.. 60 ఏళ్ల సినీసంగీత ప్రస్థానంలో ఎన్నో మధురమైన గేయాలు ఆలపించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు 20 భాషల్లో దాదాపు 48 వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు జాతీయ అవార్డులు, 31 రాష్ట్ర అవార్డులు, మైసూర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమమాని అవార్డును స్వీకరించిన గానకోకిలకు బంధువులు, సన్నిహితులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.