సినారె పాటోబయోగ్రఫీ ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’ వారి సినిమా పాట పుట్టుక నుంచి అనేక విషయాలు, విశేషాలను చర్చించింది. పుస్తకానికి పెట్టిన ఈ పేరు ఒక సినిమాపాటలోనిదే కావడం విశేషం. పాట వెనుక, పాట ముందు పెనవేసుకున్న అనేక కథలను చెప్పింది. ఈ ‘మబ్బులో ఏముంది? నా మనసులో ఏముంది?’ పాట ముచ్చట కూడా. ‘లక్షాధికారి’ చిత్రం కోసం సినారె రాసిన పాటలు ఇప్పటికీ శ్రోతల గుండెల్లో గుబాళిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని ‘దాచాలంటే దాగవులే దాగుడు మూతలు సాగవులే’, ‘మబ్బులో ఏముంది? నా మనసులో ఏముంది?’ అయితే మరీనూ!
సినారె తొలి సినిమాలో జావళీ లాగే ‘నాగార్జున సాగరం’లో కన్నడ షట్పదుల వంటివి కనిపిస్తాయి. ‘లక్షాధికారి’ లోనూ ఇటువంటిదే రాశానని వారే అంటారు. అలా ‘జముకుల కథ’లోని జానపదులబాణీ లోంచి వచ్చిందే ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ పాట. దీనిని ఎన్.టి.రామారావు, కృష్ణకుమారిలపైన చిత్రీకరించగా టి.చలపతిరావు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్ సాధించింది.
ఆమె: మబ్బులో ఏముంది?
నా మనసులో ఏముంది?
నా మనసులో ఏముంది?
అతను: మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు
నీ మనసులో పన్నీరు / అవునా..
ఆమె: ఊ…
తోటలో ఏముంది నా మాటలో ఏముంది? / నా మాటలో ఏముంది?’ అంటూ సాగిన ఈ పాట చివరి చరణం వరకు ప్రశ్నలు, జవాబులతోనే సాగుతుంది. ఈ పాటను ‘లక్షాధికారి’ సినిమాలో పెట్టినప్పటికీ ఇది రాసిన సందర్భం వేరు. దీనిని సినారె ఆకాశవాణిలో ప్రసారమైన జాతీయ సంగీత రూపకం ‘రామప్ప’ కోసం రాశారు. ‘ఈ నల్లని రాళ్లలో ఏకన్నులు దాగెనో’ పాట కూడా ఈ రూపకం లోనిదే. ఆకాశవాణి కోసం వీటిని ప్రసిద్ధ సంగీతకారులు పాలగుమ్మి విశ్వనాథం స్వరపరిచారు.
‘మబ్బులో ఏముంది..’ పాటలో సినారె పద ప్రయోగ వైచిత్రితోపాటు కవితాత్మక అభివ్యక్తి చక్కగా కనిపిస్తుంది. ఇందులో నాయకునితో కవి పలికించిన ‘మబ్బులో కన్నీరు, మనసులో పన్నీరు/ నీ మనసులో పన్నీరు’ పంక్తులు ఈ పాటకు అందాన్ని తెచ్చాయి. సినారె చెప్పినట్టు ఇవి కేవలం ప్రాస కోసం వాడిన పదాలుకావు, ‘..మట్టి మూల్గులను విని పైనున్న మబ్బుమనసు కన్నీరు పెడుతుంది. సానుభూతిలోంచి వెలువడిన ఆ కన్నీరే వర్షంగా కురిసి మట్టిని పండిస్తుంది’. ఇందులో ‘మనసులో పన్నీరు’ అనడం శృంగారాన్ని స్పృషించే ప్రయోగం. ఈ ఒక్క సినిమాలోనే కాదు దాదాపు ఐదు దశాబ్దాలు సాగిన సినారె పాట ప్రస్థానంలోని ప్రతి పాటలోనూ ఇటువంటివి అనేకం కనిపిస్తాయి.
ఆమె: ఊ… తోటలో ఏముంది?
నా మాటలో ఏముంది?
నా మాటలో ఏముంది?
అతను: తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు
నీ మాటలో తేనియలు… ఊ…ఊహు…
ఆమె: ఊహూ.. చేనులో ఏముంది?
నా మేనులో ఏముంది?
నా మేనులో ఏముంది?
అతను: చేనులో బంగారం నీ మేనులో సింగారం
నీ మేనులో సింగారం
ఆమె: ఏటిలో ఏముంది? నా పాటలో ఏముంది?
నా పాటలో ఏముంది?… అంటూ నడిచే ఈ పాటకు నారాయణరెడ్డి ఎన్ని మేలిమి బంగరు పదాల పరిమళాల చమ్కీలను అద్దారో! అందుకే అది ఎక్కడ ముట్టుకున్నా మెరుస్తుంది. ‘మాటలో ఏముంది?’ అన్న ప్రశ్నకు ‘తోటలో మల్లియలు’, ‘మాటలో తేనియలు’ అనడం, ఇదేకోవలో మరో చరణంలో ‘చేనులో ఏముంది నా మేనులో ఏముంది?’ అన్న దానికి ‘చేనులో బంగారం’, ‘నీ మేనులో సింగారం’, ‘ఏటిలో గలగలలు’, ‘పాటలో సరిగమలు’ అనడం నిదర్శనం. ఈ పదాలన్నీ బంగారు నాణేలు, కేవలం సినారె మాత్రమే చేయగలిగిన విన్యాసాలు.
నిజానికి సినారె మాట, కవిత్వం అంటేనే ఉక్తులు, చలోక్తులు. తన పాటోబయోగ్రఫీలో డా.సి.నారాయణరెడ్డి ఈ పాట గురించి ప్రత్యేకంగా పస్త్రావిస్తూ…‘చివరి చరణంలో ప్రకృతిని వదిలేసి నాయికానాయకుల ప్రసక్తి ఉండాలనుకున్నాము. ఏమైనా సరే వ్యాకరణాన్ని పక్కకుపెట్టి ఇలా ప్రయోగించాను
‘నేనులో ఏముంది నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది’
‘నాలో నీలో’ అనడానికి బదులుగా
‘నేనులో నీవులో’ అనడం ఇందులోని పదవైచిత్రి. అయినా శృంగారం శ్రుతికెక్కినప్పుడు పడుచు జంటకు వ్యాకరణం గుర్తుంటుందా’ అని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో వ్యాకరణం బోధించే ఆచార్య సినారె ఈ పాటల్లో వాటిని పక్కకు పెట్టానంటారు. అనేకచోట్ల ఉక్తి చమత్కృతులను పలికించారు. ఈ ప్రయోగం పాటకు అందాన్ని పెంచుతూనే నవ్యత్వాన్ని ఆపాదించి పెట్టింది. ‘గతము లోపల మంచి కొంచెము మనకు మిగులును అదియె సంప్రదాయము’ అంటూ పేర్కొన్న సినారె కావ్య సంప్రదాయాల్ని పాటిస్తూనే అనేక నవ్య ప్రయోగాలను చేశారు. ఈ ఒక్కపాటే కాదు ఈ సినిమాలోని ‘దాచాలంటే దాగవులే దాగుడు మూతలు సాగవులే’ పాట కూడా అత్యంత ఆదరణ పొందింది. ఇందులోని ‘పొదలలోనవున్నా పూలగంధాలు దాగలేవు/ మట్టిలోవున్నా మణుల అందాలు మాసిపోవు’, ‘నీ కులుకు నడక చూసీ రాజహంసలకు సిగ్గు కలిగె / నీ తళుకు మోము చూసీ నిండు జాబిలికి నిగ్గు తరిగె’ వంటి పాదాలు సినారె పాటల రచనలోని అభివ్యక్తి చమత్కార తళుకులు.
– పత్తిపాక మోహన్