‘అడల్ట్ కామెడీ అన్ని చోట్లా ఉంది. ట్విటర్ ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే. దానితో పోల్చుకుంటే మా సినిమాలో ఉన్నది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్. కొందరికి అర్థంకాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం.. ఈ కారణాల వల్ల సెన్సార్‌వారు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. నిజానికి మా సినిమాలో అడల్డ్ కామెడీ అంటూ ఏం లేదు.’ అని నిర్మాత సాహు గారపాటి అన్నారు. విశ్వక్సేన్ కథానాయకుడిగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘లైలా’. ఆకాంక్ష శర్మ కథానాయిక. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సాహు గారపాటి విలేకరులతో ముచ్చటించారు.
‘ప్రేమ నేపథ్యంలో సాగే లవ్ ఎంటైర్టెనర్ ఇది. ఇలాంటి కథను ఓ హీరో యాక్సప్ట్ చేయడం నాకు బాగా నచ్చింది. లేడీ గెటప్‌లో నటించడం తేలికైన విషయం కాదు. కొందరు హీరోలు భయపడ్డారు కూడా. విశ్వక్ చేస్తానని ముందుకొచ్చాడు. ‘అన్నా.. ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్..’ అని చెబుతూ ఇష్టంతో చేశాడు. ఫస్టాఫ్ మొత్తం సోనుగా, సెకండాఫ్‌లో లైలాగా అలరిస్తాడు విశ్వక్. ఆ రీజన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. విశ్వక్ లేడీ గెటప్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా దర్శకుడు రామ్‌నారాయణ్ ఈ సినిమాను మలిచాడు.’ అని తెలిపారు. మే, జూన్ నెలల్లో చిరంజీవిగారి సినిమా మొదలుపెడతామని, అనిల్ రావిపూడి మార్క్‌లో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటైర్టెనర్‌గా ఆ సినిమా ఉంటుందని సాహు గారపాటి పేర్కొన్నారు.