వచ్చే ఏడాది జరిగే ‘ఆస్కార్’ వేడుకల్లో భారత్ తరఫున ‘లాపతా లేడీస్’ అర్హత సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నది బాలీవుడ్ డైరెక్టర్ కిరణ్ రావు. రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన ఇద్దరు గ్రామీణ ప్రాంత పెళ్లి కూతుళ్ల ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. అమిర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం.. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నది. సుప్రీం కోర్టు డబ్భు ఐదేళ్ల వేడుకల్లో భాగంగా.. కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరణ్‌రావు మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతోపాటు చిత్ర బృందం కోరికని వెల్లడించింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఆస్కార్‌కు పంపిస్తుదనే నమ్మకం ఉన్నదనీ చెప్పుకొచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన కిరణ్‌రావు.. 2011లో అమీర్‌ఖాన్ హీరోగా ‘ధోభీ ఘాట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. గతేడాది ‘లాపతా లేడీస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.