Kuravi Srinath | కష్టపడితే సాధించలేనిది ఏమి లేదు.. ఇష్టపడిన రంగంలో మనసుపెట్టి పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని నిరూపించాడు కురవి గ్రామానికి చెందిన కొదుమూరి శ్రీనాథ్ (Kuravi Srinath). పాతికేళ్లు నిండిన యువకుడు మారుమూల కురవి నుండి హైదరాబాద్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. సినీ రంగుల ప్రపంచంలో తొలి అడుగువేసాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా… ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన శ్రీనాథ్ చిన్నతనం నుండి సినిమాలపై ప్రేమ పెంచుకుని కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ పూర్తి చేశాడు. తాను ఎంచుకున్న రంగంలో ఎటువంటి సహకారం లేకున్నా.. తన కాళ్లమీద తాను నిలబడి సినీ రంగంలో నిలదొక్కుకున్నాడు. తెలుగు చలన చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన చందూ మొండేటి దర్శకత్వ శాఖలో తండేల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ (Thandel)తో అసోసియేట్ డైరెక్టర్‌గా అందరి ముందుకు రాబోతున్నాడు.
కుటుంబ నేపథ్యం :
కురవి మండల కేంద్రానికి చెందిన కొదుమూరి నాగమణి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు సాయినాథ్, శ్రీనాథ్, కుమార్తె నగ్మ. కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పెద్ద కొడుకు సాయినాథ్ ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. చిన్న కుమారుడు శ్రీనాథ్ కూడా కంప్యూటర్ సైన్స్‌లో హైదరాబాద్ గురునానక్ కళాశాలలో 2018వ సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
10వ తరగతి నుండే..
2012వ సంవత్సరంలో మహబూబాబాద్ అరవింద ప్రైవేట్ స్కూల్లో పదవతరగతి చదువుతున్నప్పుడే శ్రీనాథ్ మదిలో సినిమాలపై మనస్సు మళ్లింది. తన తోటి స్నేహితుడు వీరేందర్తో కలిసి వచ్చిన ప్రతీ సినిమాను ఎలా నిర్మించాలోనని చర్చించుకునేవారు. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు… పదవతరగతి పూర్తికాగానే తన తోటిస్నేహితులుతో కలిసి షార్ట్ ఫిల్మ్ నిర్మించడం… అందులో నటించడం వ్యాపకంగా మారింది. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు ముందు భయపడ్డారు.
ముందు చదువుకోమని చెప్పడంతో హైదరాబాద్ నారాయణలో ఇంటర్మీడియట్…బీటెక్ కంప్యూటర్ సైన్సులో డిగ్రీ పూర్తిచేసాడు. అయిన మనసులోపలి జిజ్ఞాస మరిచిపోలేదు. ఇంట్లో ఒప్పించి 2018 సంవత్సరం నుండి కష్టపడ్డాడు…ఒక్కో మెట్టు ఎక్కాలి… డైరెక్టర్ కావాలని ఓ మిత్రుడిని కలిస్తే…మిత్రుడు సలహా మేరకు సినీరంగం గురించి ముందుగా తెలుసుకోవాలి అని చెప్పాడు. ఎవరు తెలియదు. ముందుగా కృష్ణానగర్ అడ్డా వద్ద జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రయాణం సాగించాడు. రోజు కూలీగా బస్సులో వెల్లి కేవలం 300 రూపాయలకు పనిచేసాడు. ఆ తరువాత మరో మిత్రుడు సూచన మేరకు సెట్ వర్క్ లో రోజుకు రూ.1100 చొప్పున పనిచేసాడు.
ఆ సమయంలో చూసేవారు శ్రీనాథ్ చదువుకోలేదు అనుకునేవారు. అలా సాగిపోతున్న సమయంలో ఓ మెకప్ ఉమెన్ శ్రీనాథ్‌ను పిలిచి ఏమి చదువుకోలేదా బాబు… అని ఆరా తీసింది. అప్పుడు తన చదువు… తన కోరిక (డైరెక్టర్) కావాలని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ ఇలా అయితే డైరెక్టర్వు కాలేవు.. డైరెక్టర్ కావాలంటే ఈ రంగంలోనే ప్రయత్నించాలని చెప్పడంతో శ్రీనాథ్ ప్రయత్నాలు మళ్లీ మొదలెట్టాడు. ఇంట్లో వాళ్లు వద్దన్నా ఇష్టమని ఈ రంగాన్ని ఎంచుకున్న. ఇక్కడ ఫెయిల్ అయితే ఎలా అంటూ మదనపడడం మొదలైంది. అవకాశాలు రావడం లేదు. ఎలా అయినా నిలదొక్కుకోవాలని పట్టుదల ఉంది. ఇంట్లో వారికి ఏమి చెప్పాలో తెలియక ఇంటికి వెళ్తామని బట్టలు సర్దుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు.
డెవిల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా..
అప్పుడే సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన వారందరి వాట్సాప్ గ్రూపులో బ్యాచీలర్ పార్టీ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని పోస్టు చూసి ట్రై చేసాడు. సంవత్సరంన్నర ఎటువంటి డబ్బులు ఆశించకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాడు. మధ్యలో అభిషేకంతో మరో రెండు సీరియల్ లను డైరెక్ట్ చేసాడు. మరో రెండుమూడు చిన్న సినిమాలు ఆ తరువాత నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా వచ్చిన డెవిల్ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసాడు. చివరకు చందూమొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమాకు అసోసియేట్ డెరెక్టర్‌గా పనిచేసాడు.
కసితో కష్టపడ్డాడు : మేనమామ శ్రీరాం నవీన్
కసితో పనిచేసాడు. చిన్నప్పటి నుండి టెక్నికల్‌గా ఎంతో ఉన్నతంగా ఆలోచించేవాడు. సినిమా రంగం అనగానే అందరం భయపడ్డాం. ఎవరెన్ని చెప్పిన చిన్నసాయి (శ్రీనాథ్‌ను ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు) వినలేదు. ముందుకు వెళ్లాడు. ఎప్పుడైనా అవసరానికి డబ్బులు తెలియకుండా కొట్టినా మళ్లీ తిరిగి కొట్టేవాడు. అంత నిక్కచ్చిగా ఉండేవాడు. వాడి కష్టమే వాడిని నిలబెట్టింది.
కష్టపడాలి : కొదుమూరి శ్రీనాథ్, అసోసియేట్ డైరెక్టర్
చిన్నతనం నుండి సినిమాలంటే ప్రాణం. షార్ట్ ఫిల్మ్ ల కోసం సోని కెమెరాను కిరాయికి తీసుకునేవాళ్లం. స్నేహితులతో కలిసి వీడియోలు తీసి మురిసేవాళ్లం. ఇంట్లో వాళ్ళకి చూపిస్తే బాగా చేసావు అనేవారు. అలా కోరిక బలపడింది. ఇంట్లో చెప్పా..
అమ్మ నాన్నలు తెలియని రంగమైనా ఎప్పుడు నిరుత్సాహపరచలేదు. అలా అని ప్రోత్సహించలేదు. చదువుకో ఆ తరువాత నీ ఇష్టం అన్నారు. ఇంజనీరింగ్ అయిపోయాక మూడు సంవత్సరాల సమయం ఇచ్చారు. కుటుంబసభ్యుల సహకారం.. ముఖ్యంగా మిత్రుల సహకారం మరవలేనిది. అవకాశాలు రావు. ఓపికతో ఎదురుచూడాలి. కష్టాన్ని… ముందుగా మనపై మనం నమ్మకంతో ముందుకుసాగాలి. మా ఊరిలో వీరభద్రస్వామి ఎంతో మహిమాన్వితుడు. మా ఇల్లు గుడికి దగ్గర. రోజు గుడిలో మొక్కుకునేవాడిని. నేను అనుకున్న రంగంలో ముందుకుసాగాలని. ఆ భగవంతుడు ఆశీస్సులు నాపై ఉన్నాయి. తండేల్ సినిమా మంచి విజయం సాధించి నేను పుట్టిన ఊరుకు మరింత మంచి పేరు తేవాలని వీరభద్రస్వామి ని ప్రార్థిస్తున్నా…
తండేల్ విజయవంతమై… కొదుమూరి కురవి శ్రీనాథ్ కు మరిన్ని మంచి అవకాశాలు వచ్చి ఓ మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం…