Kubera | ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమకి పైరసీ చాలా ఇబ్బందిగా మారుతుంది. రిలీజ్ అయిన రోజే పైరసీ ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం అవుతుండడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రల్లో, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం కుబేర ఆన్లైన్ పైరసీకి బలైంది.ఈ నేపథ్యంలో, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని యాంటీ వీడియో పైరసీ సెల్, పైరసీ మూలాలను గుర్తించేందుకు వాటర్ మార్కింగ్ టెక్నాలజీలను వినియోగిస్తూ అప్రమత్తంగా పని చేస్తోంది.
ఈ సందర్భంగా, కుబేర సినిమాను చట్టవిరుద్ధంగా రికార్డు చేసిన ఘటనను గుర్తించామన్నది ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని సెంట్రల్ మాల్లో ఉన్న పీవీఆర్ థియేటర్, స్క్రీన్-5లో ‘కుబేర’ను చట్టవిరుద్ధంగా వీడియో రికార్డు చేసినట్టు ఫిల్మ్ ఛాంబర్ వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏడాదిన్నర కాలంలో 40 సినిమాలను పైరసీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దర్యాప్తు నేపథ్యంగా ఇప్పుడు ‘కుబేర’ పైరసీ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.
పైరసీ సినిమా పరిశ్రమకు గండికొడుతున్న తీవ్రమైన సమస్య. ఫిల్మ్ ఛాంబర్, పోలీసుల కఠిన చర్యలతో ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కుబేర చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా తమిళనాట కన్నా తెలుగులో మంచి ఆదరణ దక్కించుకుంది. తెలుగులో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తమిళంలో మాత్రం సరిగా పెర్ఫామ్ చేయకపోవడం గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిజానికి ‘కుబేర’ కథ, ధనుష్ పాత్ర తమిళ సెన్సిబిలిటీస్కు తగ్గట్లుగా ఉంటాయని కమ్ముల అన్నాడు. ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలను అక్కడి వాళ్లు బాగా ఆదరిస్తారని.. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమా ఇదని.. అయినా ఈ సినిమాకు వసూళ్లు తక్కువ రావడం ఏంటో అర్థం కావడం లేదని కమ్ముల వ్యాఖ్యానించాడు.