Bigg Boss | ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ కన్నడ’ కు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (KSPCB) బిగ్ బాస్ స్టూడియోను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బెంగళూరు సౌత్ రామనగర జిల్లా బిడాదిలోని ‘జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్’ ప్రాంగణంలో బిగ్ బాస్ కన్నడ సీజన్ షూటింగ్ జరుగుతోంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ ప్రోగ్రామ్‌లలో ఒకటి. అయితే ఇప్పుడు పర్యావరణ ఉల్లంఘనలతో ఈ షో భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
KSPCB అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బిగ్ బాస్ నిర్వాహకులు అవసరమైన పర్యావరణ అనుమతులు పొందకుండానే చిత్రీకరణ జరిపారు. అంతేకాకుండా స్టూడియో ప్రాంగణం నుండి కలుషిత నీటిని నేరుగా పర్యావరణంలోకి విడుదల చేశారు. ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం, 1981 కాలుష్య నియంత్రణ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ నేపథ్యంలో రామనగర జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు స్టూడియోను సీజ్ చేయాలని KSPCB ఆదేశాలు జారీ చేసింది. అలాగే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని బెస్కామ్ (BESCOM) కు సూచనలు పంపింది. అధికారులు ఇప్పటికే స్టూడియో గేట్లు మూసివేసి, కంటెస్టెంట్లను వేరే ప్రదేశానికి తరలించారు.
ప్రతి సీజన్ సుమారు రూ. 300 కోట్లకు పైగా వ్యాపార విలువ ఉన్న బిగ్ బాస్ కన్నడ షోకు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. షూటింగ్ నిలిచిపోవడంతో నిర్మాతలు, స్పాన్సర్లు, ప్రసార సంస్థలకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ ఘటనపై బిగ్ బాస్ నిర్వాహకులు డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారని సమాచారం.న్యాయపరంగా తాము అన్ని నిబంధనలు పాటించామని, పర్యావరణ కాలుష్యం జరగలేదని వారు వాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఘటనపై మీడియా దృష్టిని మళ్లించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. బిగ్ బాస్ హౌస్ నుంచి పలు కార్లు బెంగళూరు, చెన్నపట్నం దిశల్లో వెళుతూ , మీడియా వర్గాలను మిస్లీడ్ చేయడం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ వ్యవహారంపై స్పందిస్తూ, “మేము ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశాం. అయినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదు. చట్టాన్ని ఎవ్వరూ లెక్కచేయలేరు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.