మహిళల పట్ల అకృత్యాలు, లైంగిక వేధింపులు.. సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ వుడ్, ఈ వుడ్ అని కాదు.. ఇప్పుడు అన్ని భాషల చిత్ర పరిశ్రమల్లోనూ ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి కృతిక కమ్రా సోషల్‌మీడియా వేదికగా ఓ విజ్ఞప్తి చేశారు. పరిశ్రమను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు లాంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత.. పరిశ్రమలోని మగవాళ్లదేనని చెప్పారు. ముందుగా వారివారి సినిమా షూటింగ్స్‌పై దృష్టి పెట్టాలనీ, అందులో పాల్గొంటున్న మహిళల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు.
మహిళా నటులు, ఇతర సాంకేతిక సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాకబు చేసి.. కావాల్సిన సాయం అందించాలన్నారు. పని ప్రదేశం ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలనీ, షూటింగ్ స్పాట్ల దగ్గర ఇష్టారీతిన మాట్లాడటం, మహిళలపై అసభ్యకరమైన జోకులు వేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒకరిని పొగడటానికి.. వారిని ఆక్షేపించడానికి మధ్య ఎంతో తేడా ఉంది.
ఆ హద్దును దాటకుండా.. మహిళలతో మాట్లాడగలిగితేనే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది’ అని చెప్పారు కృతిక. టెలివిజన్, ఓటీటీ షోల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది కృతిక. హుష్ హుష్ మొదలుకొని బొంబై మేరీ జాన్ వరకు.. వైవిధ్యమైన పాత్రల ద్వారా తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్నది.