Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి, నటి నూపుర్ సనన్ పెళ్లి బాజాలు మోగబోతున్నాయా అంటే, అవుననే టాక్ వినిపిస్తుంది. పాపులర్ సింగర్ స్టెబిన్ బెన్ను నూపుర్ వివాహం చేసుకోబోతుందన్న వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. జనవరి 8–9 తేదీల్లో ఉదయపూర్‌లోని ప్రతిష్ఠాత్మక లగ్జరీ వెన్యూ ఫెయిర్మాంట్ ఉదయపూర్ ప్యాలెస్‌లో ఈ వివాహం జరగనుందని సమాచారం. దేశంలోని అత్యంత ఖరీదైన, రాజసమైన పెళ్లిళ్లు జరిగే ప్రదేశంగా ఉదయపూర్‌కు ప్రత్యేక పేరుంది. ఇటీవల నేత్ర మంతెన – వంశీ గాదిరాజుల గ్రాండ్ వెడ్డింగ్ కూడా ఇక్కడే జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నూపుర్ పెళ్లికీ ఇదే డెస్టినేషన్‌గా కుటుంబ సభ్యులు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
సరస్సుల నగరంగా పేరొందిన ఉదయపూర్‌లో రాజవంశ గాంభీర్యం, ప్యాలెస్‌లు, విస్తారమైన ప్రాంగణాలు ఈ వేడుకను మరింత గ్రాండ్‌గా మార్చనున్నట్లు భావిస్తున్నారు. సమాచారం ప్రకారం… కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, ఇండస్ట్రీకి చెందిన ఎంపిక చేసిన సెలబ్రిటీలు మాత్రమే ఈ వివాహ వేడుకలకు హాజరుకానున్నారు. ఇరువర్గాల నుంచి పెళ్లి గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ, ప్యాలెస్ వద్ద డెకరేషన్ టిమ్స్, హాస్పిటాలిటీ స్టాఫ్ భారీ ఏర్పాట్లు ప్రారంభించడం ఈ రూమర్స్‌ను మరింత బలపరుస్తోంది.
వరుడు స్టెబిన్ బెన్ ఇండీ-పాప్, ప్లేబ్యాక్ ఫీల్డ్‌లో మంచి గుర్తింపు పొందిన గాయకుడు. మేరా మెహబూబ్, థోడా థోడా ప్యార్, బారిష్ వంటి హిట్ ఆల్బమ్‌లు ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చాయి. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడని నూపుర్… చాలా కాలంగా స్టెబిన్తో రిలేషన్లో ఉన్నట్లు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇద్దరూ ఈ విషయంపై పబ్లిక్‌గా చాలా తక్కువగా స్పందించేవారు. ఇప్పుడు పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. జనవరి 8 నుంచి వేడుకల సందడి మొదలు కానుండగా, జనవరి 8: మెహందీ, సంగీత్, జనవరి 9: ప్రధాన వివాహ కార్యక్రమం జరగనుందని తెలుస్తుంది. దీంతో ప్యాలెస్ మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోనుంది. అయితే… నూపుర్ సనన్ లేదా స్టెబిన్ బెన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇవన్నీ ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంటుంది.