Kriti Sanon |సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన మధ్యతరగతి మూలాలను ఎప్పటికి మర్చిపోనని చెప్పింది బాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన కృతిసనన్. ప్రేమాభిమానాలు పంచే కుటుంబం, నిస్వార్థమైన స్నేహం తోడుగా ఉంటే ఎన్ని విజయాలు సాధించినా వ్యక్తిత్వంలో మార్పు రాదని పేర్కొంది. ఇప్పటికీ తాను ఢిల్లీ నుంచి వచ్చిన మధ్యతరగతి అమ్మాయిగానే ఫీలవుతానని కృతిసనన్ చెప్పుకొచ్చింది.
ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘ప్రతి రోజు నేను నా ఢిల్లీ మిత్రబృందంతో మాట్లాడుతుంటాను. నా జయాపజయాలతో సంబంధం లేకుండా వాళ్లు నన్ను ఇష్టపడతారు. నిజంగా వారిది ఏమాత్రం కల్మషం లేని ప్రేమ. అలాంటి గొప్ప స్నేహబృందం, సంప్రదాయ విలువల్ని పాటించే కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా నా స్వభావంలో ఎలాంటి మార్పు రాలేదు. మనం పుట్టిన ప్రాంతాన్ని, చిన్ననాటి స్నేహితులను ఇష్టపడే వారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు’ అని తెలిపింది. ‘వన్-నేనొక్కడినే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ భామ బాలీవుడ్లో అగ్ర నాయికగా రాణిస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత పాత్రను పోషిస్తున్నది.