Khadgam Re Release | టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైం బ్లాక్ బస్టర్ చిత్రం ఖడ్గం(Khadgam) రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 18న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటున్నాడు దర్శకుడు కృష్ణవంశీ. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మురారి రీ రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనపై స్పందించారు. మహేశ్ బాబు నటించిన మురారి సినిమా రీ రిలీజ్లో ఒక జంట థియేటర్లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. థియేటర్లోకే తాళిబొట్టును తీసుకువచ్చిన వరుడు మహేష్ అభిమానుల ముందే పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కాగా.. ఈ ఘటనను కృష్ణవంశీ తప్పుబడుతూ.. థియేటర్లో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేసి మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను అపహాస్యం చేసి అవమానించకండి ప్లీజ్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఘటనపై తాజాగా మళ్లీ ఖడ్గం రీ రిలీజ్ ఈవెంట్లో స్పందించాడు కృష్ణవంశీ.
కృష్ణవంశీ మాట్లాడుతూ.. ఈ భుమిపై దేవుడు సృష్టించిన వాటిలో అత్యంత అందమైనది అమ్మాయి. వారిని ఎలా చూపించాలో నా సినిమాలలో అలానే చూపించాను. అయితే మురారి రీ రిలీజ్ టైంలో నా సినిమాలలో హీరోయిన్ పాత్రను చాలా మంది రీ క్రియేట్ చేశారు. కానీ ఒక జంట థియేటర్లోనే పెళ్లి చేసుకుంది. ఈ వీడియో చూసినప్పుడు పెళ్లిని అలా చేసుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మన కల్చర్‌కు ఒక అర్థం ఉంది. ఇక థియరీ ఉంది. ఒక సెన్స్ ఉంది. ఆలోచన ఉంది. ఇవి వారికి తెలియక.. అలాగే సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుంది అని కొంచెం ఇలా చేసి ఉంటారు. కానీ ఇది తప్పు అంటూ కృష్ణవంశీ చెప్పుకోచ్చాడు.