Krishna Leela | యువ ప్రతిభాశాలి దేవన్ హీరోగా, తన స్వీయ దర్శకత్వంలో ఓ అద్భుతమైన సూపర్నాచురల్ లవ్‌స్టోరీ రూపొందుతోంది. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. బేబీ వైష్ణవి సమర్పణలో, మహాసేన్ విజువల్స్ బ్యానర్‌పై జ్యోత్స్న జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ మరియు సంభాషణలను అనిల్ కిరణ్ కుమార్ జి అందించారు. ఈ సినిమాకు ‘కృష్ణ లీల’ అనే ఆకర్షణీయమైన టైటిల్‌ను ఖరారు చేశారు, ‘తిరిగొచ్చిన కాలం’ అనే ట్యాగ్‌లైన్‌తో. చిత్ర టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర్ శాస్త్రి, ప్రముఖ ఛాయాగ్రాహకుడు చోటా కే నాయుడు హాజరయ్యారు.
నిఖిల్ మాట్లాడుతూ.. దేవన్ చాలా అభిరుచి కలిగిన నటుడు మరియు దర్శకుడు. ‘హ్యాపీ డేస్’కు ముందు నేనూ ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూసేవాడిని. దైవకృపతో నాకు ‘హ్యాపీ డేస్’ లభించింది. అదే దైవకృపతో దేవన్‌కు ‘కృష్ణ లీల’తో పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘కృష్ణ లీల’ మోషన్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. దేవన్లో విభిన్న షేడ్స్ చూసి ఆకట్టుకున్నాను. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అందరూ ఈ బృందాన్ని సమర్థించాలని కోరుకుంటున్నానంటూ తెలిపారు.
బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ.. జై శ్రీకృష్ణ! దేవన్ చాలా సానుకూల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అతన్ని చూస్తే సానుకూల శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. నిరంతరం కృషి చేసేవాడు ఎప్పటికైనా గొప్ప విజయం సాధిస్తాడు. దేవన్ ఈ చిత్రంతో అలాంటి విజయాన్ని అందుకుంటాడని నమ్ముతున్నాను. రచయిత అనిల్ గారు చాలా సంస్కారవంతులు. ‘కృష్ణ లీల’ అనే టైటిల్ అద్భుతం. ఈ సినిమా శాశ్వత హిట్‌గా నిలిచిపోతుందని నమ్మకం ఉంది. పాటలు విన్నాను, అద్భుతమైన సాహిత్యం, సంగీతం ఉన్నాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ వెల్లడించారు.
చోటా కే నాయుడు మాట్లాడుతూ..ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది. నిర్మాతలు గొప్ప అభిరుచితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు. నిఖిల్ ఈ ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉంది. అతనిలాంటి యువ స్టార్, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. దేవన్ చాలా ప్రతిభావంతుడు, ఈ సినిమాతో అతనికి తప్పకుండా మంచి గుర్తింపు వస్తుందంటూ వెల్లడించారు.
హీరో & దర్శకుడు దేవన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నాకు సినిమా జీవితాన్ని ఇచ్చిన నిర్మాతలు జ్యోత్స్న గారికి, అనిల్ గారికి ధన్యవాదాలు. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. చోటా కే నాయుడు గారు నాకు ఇష్టమైన ఛాయాగ్రాహకుడు. ఆయన్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. చివరకు కలిసి కథ చెప్పాను, ఆయన సూచనలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ జర్నీ ఒక అద్భుతంలా మొదలైంది. గంగాధర్ శాస్త్రి గారికి కథ చెప్పాను, ఆయన విలువైన సలహాలు ఇచ్చారు. నిఖిల్ అన్న ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలంటూ వెల్లడించారు.
ఛాయాగ్రాహకుడు సతీష్ ముత్యాల మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలటూ తెలిపారు.
నిర్మాత జ్యోత్స్న మాట్లాడుతూ.. గంగాధర్ శాస్త్రి గారికి, చోటా కే నాయుడు గారికి, నిఖిల్ గారికి నమస్కారం. ‘కృష్ణ లీల’ నిజంగా ఒక అద్భుతం. ప్రతి ఒక్కరి జీవితంతో కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నామంటూ తెలిపారు.
కథా రచయిత అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా మేము ప్లాన్ చేసినది కాదు, అది సహజంగా జరిగింది. నేను న్యాయవాదిగా పనిచేశాను. ప్రేమ గురించైనా, యుద్ధం గురించైనా మాట్లాడాలంటే కృష్ణుడి పేరే చెప్తాం. కృష్ణుడు ముందుగా ప్రేమికుడు. దేవన్ చాలా అంకితభావంతో పనిచేశాడు. మోషన్ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందంటూ వెల్లడించారు.
నటీనటులు: దేవన్, ధన్య బాలకృష్ణన్, వినోద్ కుమార్, పృధ్వి, రవి కాలే, తులసి, 7ఆర్ట్ సరయు, ఆనంద్ భరత్
సాంకేతిక బృందం:
దర్శకత్వం: దేవన్
నిర్మాత: జ్యోత్స్న జి
బ్యానర్: మహాసేన్ విజువల్స్
కథ & సంభాషణలు: అనిల్ కిరణ్ కుమార్ జి
ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్: KSR
కొరియోగ్రఫీ: రఘు మాస్టర్
ఫైట్స్: నందు మాస్టర్
కళ: రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్