Krish | పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా ఏఎం రత్నం సమర్పణలో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ జులై 24 ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ మొదలు కాగా, ఆయన మధ్యలో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో జ్యోతికృష్ణ చిత్రాన్ని పూర్తి చేశారు. గత ఐదేళ్లుగా వివిధ కారణాల వల్ల వాయిదాల పర్వం ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకి విడుదలై మంచి విజయం సాధించింది . తాజాగా క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి గల కారణాలు త్వరలోనే తెలుస్తాయని అనడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలో వెళ్లిపోవడానికి సంబంధించిన అసలు కారణాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయి అంటూ క్రిష్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. తరకు పవన్ కళ్యాణ్‌తో ఎలాంటి విభేదాలు లేవని, మా మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవంటూ స్పష్టం చేశారు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో పవన్ గారితో మళ్లీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అలాగే, సినిమా విడుదలకు ముందు క్రిష్ సోషల్ మీడియాలో పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. హరి హర వీరమల్లు చిత్రం పూర్తవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారు ప్రధాన కారణాలు అని పేర్కొంటూ పోస్ట్ చేశారు.
ఈ పరిణామాలపై పవన్ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో పవన్ – క్రిష్ కాంబోలో మరో సినిమా ఖచ్చితంగా రావాలని ఆశిస్తున్నారు. కాగా చిత్ర ప్రమోషన్స్ సమయంలో పవన్ కళ్యాణ్.. క్రిష్‌పై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ స్క్రిప్ట్ వినగానే ఇది సాధారణ కథ కాదని అర్థమైంది. కృష్ణా తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తానుల దగ్గరికి ఎలా వచ్చింది.. ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా సాగింది అన్న నేపథ్యంలో జరిగే కథ ఇది. క్రిష్ జాగర్లమూడి మంచి కాన్సెప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. అందుకు ఆయన్ని అభినందించి తీరాలి అని మెచ్చుకున్నారు. ఇక హరిహర వీరమల్లు ఓవర్సీస్లో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.