Kothaloka | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్, స్టార్ హీరోలు లేకుండా కూడా సినిమా హిట్ అవుతుందని మళ్లీ మరోసారి నిరూపితమైంది. ఇటీవల విడుదలైన ‘లోక చాప్టర్ 1: చంద్ర’ చిత్రం చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామా సినిమా రెండు వారాలకే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా మలయాళంలోనూ అరుదైన ఘనత సాధించింది. రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 కేరళలో రూ.73 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘లోక చాప్టర్ 1: చంద్ర’ అదే మార్క్‌ను క్రాస్ చేసి రూ.74.7 కోట్లు రాబట్టి, కేరళలో బాహుబలి రికార్డును అధిగమించిన తొలి సినిమా అయ్యింది. ప్రస్తుతం ఇది కేరళలో హయ్యెస్ట్ గ్రాసర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.
ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్కి ఇది ఒక బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం వంటి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అద్భుత శక్తులు ఉన్న యువతిగా ఆమె పోషించిన ‘చంద్ర’ పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. డైరెక్టర్ డామినిక్ అరుణ్.. ఫాంటసీ, సూపర్ హీరో, ఫ్యామిలీ ఎమోషన్స్లను కలిపి అద్భుతంగా స్క్రీన్‌పై ఆవిష్కరించాడు. తండ్రి కనిపించకపోవడంతో తన శక్తులను కనుగొనే ఓ యువతిని చుట్టూ కథ తిరుగుతుంది. శాంతి బాలచంద్రన్ రచన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.
దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వేపేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమైంది. కళ్యాణి ప్రియదర్శన్‌తో పాటు నాస్లెన్, శాండీ, అరుణ్ కురియన్, చందు సలీంకుమార్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ రోజుల్లో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారనేది ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. స్టార్స్ లేకపోయినా, పవర్ ఫుల్ కథ, మంచి నాటకీయత ఉంటే చాలు హిట్ టాక్ వస్తుందనేది ఈ మూవీతో మరోసారి స్పష్టమైంది.