Kota Srinivasa Rao | తెలుగు చిత్ర పరిశ్రమలో కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1978లో చిరంజీవి సినిమా ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన ఇండస్ట్రీకి ఆరంగేట్రం చేశారు. కమెడియన్ గా , విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 850 సినిమాల్లో నటించిన ఆయనని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అలాగే ఆయన నటనా ప్రతిభకు ప్రతీకగా తొమ్మిది నంది అవార్డులు కూడా దక్కాయి. కోట శ్రీనివాసరావు నటుడిగానే కాకుండా రాజకీయ వేత్తగానూ రాణించారు. 1999- 2004 మధ్య కాలంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన తర్వాత పాలిటిక్స్‌కి దూరంగా ఉండి తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టారు. అనంతరం అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన ఆయన ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. చివరిగా పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లులో నటించారు కోట.
కోట నటించిన చివరి చిత్రం హరి హర వీరమల్లు జులై 24న విడుదల కాగా, ఆయన జూలై 13న కన్నుమూసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తుదిశ్వాస విడిచారు. కోట మరణించిన 11 రోజులకి ఆయన చివరిసారి నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో విడుదలైంది. కొద్ది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నా, మంచి కథలు వస్తే నటించేందుకు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఈ క్రమంలో కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు కోట శ్రీనివాసరావు . అదే తరహాలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమాలో కోట ‘కొల్లూరు సంస్థాన రాజు’గా కనిపించారు. సినిమా మధ్యలో పవన్ కళ్యాణ్‌తో కలిసి కొన్ని సన్నివేశాలలో నటించడంతో అభిమానులకు ఇది మరింత ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. తెరపై సుమారు 5 నిమిషాలపాటు ఆయన కనిపించినా, ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం చెరగని ముద్ర వేసారు. చివరి సినిమాలో ఆయన నటనను చూసి అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయన స్వరంలో, చూపులో, మాటల్లో కనిపించిన జీవం మళ్లీ తళుక్కున మెరిసింది. “ఇది ఆయన చివరి సినిమా అనగానే కన్నీళ్లు ఆగలేదంటూ” పలువురు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్ర చిన్నదే అయినా సినిమాకి పునాదిగా మారింది. తన పాత్రను ఆయన తనదైన శైలిలో నటించి అలరించారు.