Kota Srinivasa Rao | తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసను చాలా అరుదుగా వినియోగించేవారు. అదీ విలన్, కమెడియన్ క్యారెక్టర్లకు మాత్రమే మన యాసను వాడేవారు. అయితే తెలంగాణ యాసపై ఆసక్తి పెంచుకున్న కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao).. ఆ పదాలను ఎలా పలకాలో నేర్చుకుని మరీ సినిమాల్లో డైలాగులు చెప్పారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఆయన మొదట్లో ఆ ప్రాంత యాసలోనే సినిమాలు చేశారు. అయితే ఓసారి హైదరాబాద్ వచ్చిన ఆయనకు తెలంగాణ యాస ముఖ్యంగా హైదరాబాద్ లో తెలుగు బాగా నచ్చింది. దీంతో తెలంగాణ యాసపై మక్కువ పెంచుకున్న ఆయన 1985లో ప్రతిఘటన సినిమాలో తొలిసారి మన యాసలో డైలాగులు చెప్పారు. అది అందరినీ ఆకట్టుకోవడంతో రాత్రికి రాత్రే ఆయనకు స్టార్డమ్ వచ్చింది. దీంతో తెలంగాణ ప్రజలకు కోట మరింత దగ్గరయ్యారు. ఆయన విలన్గా చేసిన చాలా పాత్రల్లో యాస.. నైజాందే ఉంటుంది. అరే భయ్, ఏందిరా భయ్, మస్తు ఉంది, పరేషన్ నై ఇలాంటి పదాలు బాగా ఆకట్టుకున్నాయి.
కాగా, గత కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఫిలింనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.