Kohrra Season 2 | పంజాబ్ నేపథ్యంలో సాగే క్రైమ్ డ్రామా ‘కొహ్రా’ రెండో సీజన్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా వచ్చిన మొదటి సీజన్ భారీ విజయం సాధించడంతో, ఈ కొత్త సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కథలో కొత్త మలుపులు, మరింత లోతైన మిస్టరీ ఉన్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. కొత్త సీజన్ దలేర్‌పురా అనే పట్టణం చుట్టూ తిరుగుతుంది. ఒక మహిళ దారుణ హత్యకు గురవడం, ఆ కేసును ఛేదించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలే ఈ సీజన్ ప్రధానాంశం. మొదటి సీజన్లో ఆకట్టుకున్న అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ అమర్‌పాల్ గరుండి (బరున్ సోబ్తీ), ఈసారి కొత్త పై అధికారి ధన్వంత్ కౌర్ (మోనా సింగ్) ఆధ్వర్యంలో పనిచేయబోతున్నాడు. వీరిద్దరి మధ్య ఉండే వైరుధ్యాలు, కేసులోని క్లిష్టత ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయనున్నాయి. ఇందులో బరున్ సోబ్తీతో పాటు మోనా సింగ్, రణ్విజయ్ సింఘా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుదీప్ శర్మ, ఫైసల్ రెహమాన్ ఈ సిరీస్‌ను సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ కొత్త సీజన్ ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.