‘లాక్డౌన్ తర్వాత సినీ నిర్మాణంలో చాలా మార్పులొచ్చాయి. నిర్మాతలు వారి కంఫర్ట్‌జోన్ నుంచి బయటికొచ్చి ధైర్యంగా సినిమాలు చేస్తే గానీ విజయాలు రావడం లేదు’ అన్నారు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్. ఆయన సమర్పణలో రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ ఈ నెల 12న విడుదలకానుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ విలేకరులతో ముచ్చటించారు.
నిర్మాతగా తాను కొంత గ్యాప్ తీసుకున్నానని, దర్శకుడు శ్రీనివాస్ మన్నె చెప్పిన కాన్సెప్ట్‌లో కొత్తదనం నచ్చడంతో ఈ సినిమా చేశానని తెలిపారు. సాధారణంగా హరర్ సినిమాలు వాస్తవికతకు దూరంగా, ఎక్కువగా డ్రామా కలబోసి ఉంటాయని, అందుకు భిన్నంగా ‘ఈషా’ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, ప్రేక్షకులు రియలిస్టిక్ ఫీల్‌తో థియేటర్ల నుంచి బయటికొస్తారని ఆయన చెప్పారు. ‘హారర్ థ్రిల్లర్‌కు విజువల్స్, సౌండింగ్ చాలా ముఖ్యం. ఈ రెండూ సినిమాకు బాగా కుదిరాయి. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య ఉండే సంఘర్షణను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.
లోకంలో మంచి, చెడూ ఉన్నట్లే గాడ్, ఈవిల్ ఉంటాయని నమ్ముతారు. ఈ వైరుధ్య భావనలను చర్చించే హ్యూమన్ డ్రామా ఇది’ అని కేఎల్ దామోదరప్రసాద్ పేర్కొన్నారు. తమ సంస్థలో ఏడాదికి మూడునాలుగు సినిమాలు చేసిన సందర్భాలున్నాయని, అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, ‘అఖండ-2’ చిత్రానికి వచ్చిన సమస్యను గతంలో చాలా సినిమాలు ఎదుర్కొన్నాయని, ఈ విషయంలో ఆయా నిర్మాతలే సమస్యను పరిష్కరించుకోవాలని, నిర్మాతల మండలి పరంగా చేసేది ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.