బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ మిస్టిక్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు.‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన పశ్చిమ దిక్కున ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం’ అనే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సువర్ణమాయ అనే ఇంటిలో ఆత్మల్ని అన్వేషిస్తూ ఓ మిత్రబృందం చేసిన ప్రయాణం, అక్కడ వారికి ఎదురైన భయంకర పరిస్థితులు థ్రిల్లింగ్గా అనిపించాయి.
ట్రైలర్ చివరి సన్నివేశంలో అనుపమ పరమేశ్వరన్ దెయ్యం పాత్రలో కనిపించి మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ ..సీట్ఎడ్జ్ థ్రిల్లర్ ఇదని, సినిమా చూస్తున్నంత సేపు ఫోన్ వైపు చూడాలన్న ఆలోచనే రాదని, అంత థ్రిల్లింగ్గా ఉంటుందన్నారు. హారర్ సినిమాలు తనకు ఇష్టమైన జోనర్ అని అనుపమ పరమేశ్వరన్ పేర్కొంది. సినిమా అంచనాల్ని అందుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాత సాహు గారపాటి తెలిపారు. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరిందని, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందని దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అన్నారు.