నటీనటులు: కిరీటీ, శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావురమేష్, ఆచ్యుత్ రావు, సత్య, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: రాధాకృష్ణారెడ్డి
నిర్మాత: రజనీ కొర్రపాటి
సమర్పణ: సాయి శివానీ
సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్
విడుదల తేదీ : జూలై 18
పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్. వైరల్ వయ్యారి పాటతో ఫుల్ వైరల్‌గా మారిన ఈ కుర్రాడు జూనియర్‌తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలీల, జెనిలియా డిసౌజా, రవిచంద్రన్, రావురమేష్, ఆచ్యుత్ రావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా.. సాయి శివానీ సమర్పణలో వరాహి చలన చిత్ర, సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి నిర్మించారు. తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూలో చూద్దాం.
కథ
విజయనగరం గ్రామానికి చెందిన కోదండపాణి (రవిచంద్రన్) మరియు శ్యామల దంపతులకు లేటు వయసులో పుట్టిన బిడ్డ అభి (కిరీటీ రెడ్డి). అయితే దురదృష్టవశాత్తు అభి పుట్టిన వెంటనే తల్లి శ్యామల మరణిస్తుంది. అప్పటి నుంచి కోదండపాణి అభిని అన్నీ తానై అభిని ప్రేమతో పెంచుతాడు. ఒక క్రమంలో కొడుకుపై అతి ప్రేమ చూపించడం వలన ఆ ఇష్టం అభికి చిరాకును తెప్పిస్తుంది. దీంతో తండ్రికి దూరంగా కాలేజీ చదువుల కోసం సిటీకి వెళతాడు. అక్కడే స్పూర్తి (శ్రీలీల) అనే అమ్మాయిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే బీటెక్ పూర్తి చేసిన తర్వాత స్పూర్తి చేసే కంపెనీలోనే జాబ్ తెచ్చుకుంటాడు అభి. ఈ కంపెనీకి బాస్ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కి అభి అంటే అస్సలు పడదు. తొలిరోజే అభి తన ప్రవర్తనతో సౌజన్య కోపం తెప్పిస్తాడు. ఇదిలావుంటే సౌజన్య కంపెనీ నిర్వహిస్తున్న విజయనగరం గ్రామంలో తాము ఇచ్చే ఫండ్స్ విషయంలో భారీ కుంభకోణాన్ని అభి బయటపెడుతాడు. దీంతో ఈ విషయంపై విజయనగరం వెళ్లాలని కంపెనీ పెద్ద అయిన గోపాల్ (రావు రమేష్) సౌజన్యను, అభిని ఆదేశిస్తాడు. అయితే వీరిద్దరూ విజయనగరం వెళ్లాక అక్కడ ఏం జరిగింది. విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? విజయకు అభికి ఉన్న రిలేషన్ ఏమిటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
చేసింది మొదటి చిత్రమే అయిన చూడడానికి అలా అనిపించకుండా నటించాడు కిరీటి రెడ్డి. ఈ సినిమా కోసం కిరీటి కష్టపడిన తీరు.. స్క్రీన్‌పై ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. ఇక దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి ఒక కొత్త హీరో పరిచయానికి అవసరమైన అన్ని కమర్షియల్ హంగులను కథలో పొందుపరిచాడు. తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు, అన్నయ్య-చెల్లెలు సెంటిమెంట్లను కలిపి ఒక రెగ్యులర్ డ్రామాను సృష్టించాడు. దర్శకుడి ఆలోచనను కిరీటి తన అద్భుతమైన ఎనర్జీతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. రొటీన్ కథ, కథనంలోని అనేక లోపాలను కిరీటి తన టాలెంట్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాలో ప్రత్యేకించి కొత్తదనం ఏమీ లేదు. ఇది కేవలం ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే. సినిమాలోని మొదటి భాగం కాలేజీ నేపథ్యంతో సరదాగా సాగుతుంది, కానీ రెండో భాగం రొటీన్ సెంటిమెంట్ అంశాలతో లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. రెండో భాగంలో “వైరల్ వయ్యారి” పాట లేకపోతే సినిమా పరిస్థితి ఇంకోలా ఉండేదనిపిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే, ఇది పక్కా మాస్ ఫార్మాట్లో రూపొందించిన కమర్షియల్ సినిమా.
నటినటులు
నటీనటుల విషయానికి వస్తే.. కిరిటీ అన్ని రకాలుగా అదరగొట్టారు. తాను అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం ఎక్కువగానే కనిపించింది. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో మాత్రం కిరీటి అదరగొట్టేశాడు. ప్రతి సాంగ్‌లోనూ కిరీటి స్టెప్పులకి థియేటర్లో గట్టిగానే రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్‌లో శ్రీలీలకి గట్టి పోటీ ఇచ్చాడు హీరో. నార్మల్‌గా శ్రీలీల స్టెప్పులేస్తుంటే పక్కనున్న వాళ్లని చూడటం చాలా కష్టమంటూ ఫ్యాన్స్ అంటారు.. కానీ వైరల్ వయ్యారి పాటలో మాత్రం ఎవరిని చూడాలిరా అన్నట్లుగా డ్యాన్స్ చేశాడు కిరీటి. అలాగే చాలా ఏండ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన జెనీలియా తన నటనతో ఆకట్టుకుంది. హీరోయిన్ శ్రీలీల ఛాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోయింది. రవిచంద్రన్ సెంటిమెంట్‌ను గుప్పించాడు. సినిమాను భావోద్వేగంగా మార్చడంలో తన వంతు పాత్రను నూటికి నూరుశాతం పోషించాడు. రావు రమేష్ మరోసారి బలమైన సపోర్టింగ్ రోల్లో మెప్పించారు.
సాంకేతిక రంగం
దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఒక నటుడికి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కావాల్సిన బీజీఎంని ఈ సినిమాలో దేవిశ్రీ అందించాడు. అలాగే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించాడు. అవినాష్ కోల్లా ఆర్ట్ వర్క్ సూపర్‌గా ఉంది. గ్రామీణ వాతవరణం, కార్పోరేట్ ఆఫీస్, కాలేజీ న్విరాన్మెంట్ అవినాష్ కోల్లా చక్కగా డిజైన్ చేశారు. వారాహి బ్యానర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాను నిర్మించింది.
చివరిగా “జూనియర్” సినిమాను ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఒక రెగ్యులర్ సెంటిమెంట్‌తో కూడిన ఫ్యామిలీ డ్రామా. ఒక కొత్త హీరోను సినిమా రంగానికి పరిచయం చేయడానికి అవసరమైన అన్ని కమర్షియల్ అంశాలలో కిరీటి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. అతని నటన, డ్యాన్స్, మరియు ఫైట్స్ ఒక డెబ్యూ హీరోగా ఆకట్టుకున్నాయి. సినిమాలో ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది. అదే సమయంలో, సెంటిమెంట్ డోస్ కూడా ఎక్కువే. అంచనాలు లేకుండా సినిమాకి వెళితే మంచి పైసా వసూల్ సినిమా అవుతుంది.
రేటింగ్ : 2.5/5